సీపీఐ రామకృష్ణ కులంపై వ్యాఖ్యలు.. యాదవులను క్షమాపణలు కోరిన సీపీఐ నారాయణ!
- ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో వ్యాఖ్యలు
- చంద్రబాబు పార్టీకి తమది తోకపార్టీ అని ఆరోపిస్తున్నారన్న రామకృష్ణ
- రామకృష్ణను రామకృష్ణ చౌదరి అంటూ కులం ఆపాదిస్తున్నారని ఆవేదన
సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కులం విషయంలో తాను చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ క్షమాపణలు వేడుకున్నారు. తన వ్యాఖ్యలు యాదవులను బాధపెట్టి ఉంటే క్షమించాలని కోరారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ నిర్వహించే ‘ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో నారాయణ మాట్లాడుతూ.. ‘‘రామకృష్ణ కమ్మోడు కాదు గొల్లోడు’’ అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై దుమారం రేగడంతో నారాయణ స్పందించారు.
తాను ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని, వాడుక భాషలో అన్నట్టుగానే ఆయన కులాన్ని ప్రస్తావించానని చెప్పారు. అధికార వైసీపీ తమ పార్టీని బ్లాక్‌మెయిల్ చేస్తోందన్నారు. చంద్రబాబు పార్టీకి తమది తోక పార్టీ అని అంటున్నారని అన్నారు. రామకృష్ణ కులాన్ని అందుకు వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామకృష్ణ చౌదరి అని పిలుస్తూ కులాన్ని ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగానే తాను ‘రామకృష్ణ కమ్మోడు కాదు.. గొల్లోడు’ అన్నానని గుర్తు చేశారు. యాదవ సోదరులను తన వ్యాఖ్యలు బాధపెట్టి ఉంటే అందుకు తనను క్షమించాలని నారాయణ కోరారు.