ఐదో కేసులోనూ లాలూను దోషిగా తేల్చిన సీబీఐ కోర్టు
- డోరండా ట్రెజరీ ద్వారా రూ.139.35 కోట్ల అక్రమాలు జరిగాయన్న కోర్టు
- ఈ నెల 21న శిక్ష ఖరారు
- తీర్పు సందర్భంగా కోర్టుకు వచ్చిన లాలూ
రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధిపతి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణానికి సంబంధించి చివరిదైన ఐదో కేసులోనూ దోషిగా తేలారు. డోరండా ట్రెజరీ నుంచి రూ.139.35 కోట్లను అక్రమ మార్గాల్లో కొల్లగొట్టారని రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ధారించింది. మొత్తంగా కుంభకోణంలోని ఐదు కేసుల్లోనూ ఆయన దోషిగా తేలినట్టయింది. కాగా, సీబీఐ కోర్టు తీర్పు నేపథ్యంలో ఇవాళ ఆయన కోర్టుకు హాజరయ్యారు. జడ్జి సి.కె. శశి తీర్పు చెప్పే సమయంలో కోర్టు రూంలోనే ఉన్నారు.
మరో 98 మంది నిందితులు కూడా కోర్టుకు రాగా.. అందులో 24 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. మిగతా వారిలో మాజీ ఎంపీ జగదీశ్ శర్మ, ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ ధ్రువ్ భగత్ సహా 35 మందికి మూడేళ్ల జైలు శిక్షను విధించింది. లాలూ సహా మిగతా 39 మందికి ఈ నెల 21న శిక్ష విధించనున్నారు.
కాగా, లాలూ ఆరోగ్యం బాగాలేనందున రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)కు తరలించేందుకు అనుమతివ్వాల్సిందిగా కోరుతూ కోర్టులో పిటిషన్ వేశామని లాలూ తరఫు లాయర్ ప్రభాత్ కుమార్ చెప్పారు.
కాగా, ఇప్పటికే దోషిగా తేలిన కేసులకు సంబంధించి లాలూకు 14 ఏళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడున్నరేళ్ల పాటు జైలులోనూ గడిపారు. అయితే, ఆరోగ్యం బాగాలేని కారణంగా ఎక్కువగా రిమ్స్ లోనే ఉండాల్సి వచ్చింది. ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఢిల్లీకి తరలించారు. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు.