మమ్మల్ని బెదిరిస్తావా.. మేం నీ అబ్బలాంటోళ్లం!: కేంద్రమంత్రిపై శివసేన ఎంపీ ఫైర్!
-మహారాష్ట్రలో బీజేపీ వర్సెస్ శివసేన
-కేంద్రమంత్రి నారాయణ్ రాణే, శివసేన నేతల మధ్య యుద్ధం
-ఈడీ నోటీసులు ప్రస్తావించిన రాణే
-ఇక్కడెవరూ బెదిరిపోరన్న సంజయ్ రౌత్
మహారాష్ట్ర రాజకీయాల్లో కొంతకాలంగా బీజేపీ వర్సెస్ శివసేన అన్నట్టుగా పోరు నడుస్తోంది. ముఖ్యంగా కేంద్రమంత్రి నారాయణ రాణే శివసేన నేతలంటేనే మండిపడుతున్నారు. మాతోశ్రీ (థాకరేల నివాసం)లో నలుగురికి నోటీసులు ఇచ్చేందుకు ఈడీ సిద్ధమవుతున్నట్టు నాకు తెలిసింది అంటూ రాణే నిన్న వ్యాఖ్యానించారు. పరోక్షంగా సీఎం ఉద్ధవ్ థాకరే కుటుంబానికి వార్నింగ్ ఇచ్చారు.
అయితే దీనిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్రంగా స్పందించారు. బెదిరింపులు మానుకోవాలని రాణేకు హితవు పలికారు. “నువ్వు కేంద్రమంత్రివి కావొచ్చు… కానీ ఇది మహారాష్ట్ర అని మర్చిపోవద్దు. నువ్వు బెదిరించాలని భావిస్తే మేం నీ అబ్బలాంటోళ్లం… దీనికి అర్థం ఏంటో నీకు బాగా తెలుసనుకుంటా” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, “తన జ్యోతిష్యంతో నారాయణ్ రాణే మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారు. అయితే మాకు కూడా జ్యోతిష్యం తెలుసన్న సంగతి ఆయన గ్రహించాలి” అని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు.