ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కన్నుమూత
- ఈ ఉదయం గుండెపోటుకు గురైన గౌతమ్ రెడ్డి
- హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స
- 49 ఏళ్ల వయసులో కన్నుమూసిన గౌతమ్ రెడ్డి
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం చెందారు. ఈరోజు ఉదయం ఆయనకు గుండెపోటు రాగా… హైదరాబాదులోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఆసుపత్రికి వచ్చే సమయానికే ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఆయనను కాపాడేందుకు వైద్యులు అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ఆయన మరణించిన విషయాన్ని అపోలో వైద్యులు ఆయన భార్యకు సమాచారం అందించారు.
గౌతమ్ రెడ్డి మరణంతో ఆయన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. వైసీపీ శ్రేణులు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. ఆయన మృతి పట్ల పార్టీలకు అతీతంగా అందరూ దిగ్భ్రాంతికి గురవుతున్నారు. 49 ఏళ్ల చిన్న వయసులోనే ఆయన మరణించడం అందరిలో విషాదాన్ని నింపుతోంది.
వారం రోజుల పాటు దుబాయ్ పర్యటనను ముగించుకుని నిన్ననే ఆయన హైదరాబాదుకు వచ్చారు. దుబాయ్ ఎక్స్ పోలో ఆయన పాల్గొన్నారు. ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చే దిశగా పలు సంస్థలతో సంప్రదింపులు జరిపి, కొన్ని సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుసగా రెండు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తనయుడే మేకపాటి గౌతమ్ రెడ్డి.
గౌతమ్‌రెడ్డి మరణంపై అపోలో వైద్యుల ప్రకటన విడుదల!
ఏపీ యువ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఈ ఉదయం ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంపై హైదరాబాద్ అపోలో హాస్పిటల్ వైద్యులు ప్రకటన చేశారు. ఇంటి వద్ద గౌతమ్‌రెడ్డి కుప్పకూలారని… ఉదయం 7.45 గంటలకు అపోలో ఆసుపత్రికి తీసుకొచ్చారని ప్రకటనలో తెలిపారు.
స్పందించని స్థితిలో ఆయనను హాస్పిటల్ కు తీసుకొచ్చారని… ఆసుపత్రికి వచ్చే సమయానికే శ్వాస ఆడటం లేదని చెప్పారు. ఐసీయూలో వైద్య బృందం తీవ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయిందని తెలిపారు. ఉదయం 9.16 గంటలకు ఆయన కన్నుమూశారని వెల్లడించారు.
నేనంటే మేకపాటి గౌతమ్‌రెడ్డి ఎంతో అభిమానం చూపేవారు: వెంకయ్యనాయుడు

ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్‌రెడ్డి పరమపదించడం అత్యంత విచారకరం. వారు ఎంతో సౌమ్యులు, సంస్కారవంతులు. ప్రజా సమస్యల పట్ల అవగాహన, చేసే పని పట్ల నిబద్దత కలిగిన నాయకులు’ అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
‘శ్రీ గౌతమ్‌రెడ్డి తాత గారి సమయం నుంచి వారి కుటుంబంతో సాన్నిహిత్యం ఉంది. నేనంటే ఎంతో అభిమానం చూపేవారు. అలాంటి వ్యక్తి చిన్న వయసులోనే దూరం కావడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను’ అని వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు.
ఎల్లుండి ఏపీలో మంత్రి మేకపాటి అంత్యక్రియలు.. 2 రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన ఏపీ సర్కారు

అమెరికాలో ఉన్న గౌతమ్‌రెడ్డి కుమారుడు అర్జున్‌రెడ్డి రేపు స్వగ్రామానికి చేరుకునే అవకాశం ఉంది. దీంతో ఎల్లుండి బ్రాహ్మణపల్లిలో గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలను ఏపీ ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తారు. కాగా, ఏపీ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది.