- ఉక్రెయిన్ వాసుల్లో పొంగిపొర్లుతున్న దేశభక్తి
- రష్యాపై పోరుకు తుపాకీ పడుతున్న వైనం
- మాతృదేశం కోసం పోరాడతానని చెబుతున్న అనస్తాసియా లెన్నా
- గతంలో అందాల పోటీల్లో విజేతగా నిలిచిన లెన్నా
రష్యా దండయాత్ర నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రజల్లో దేశభక్తి పొంగిపొరలుతోంది. దేశం కోసం ప్రాణత్యాగాలకైనా సిద్ధపడుతున్నారు. సైనికులే కాదు, వివిధ రంగాలకు చెందిన ప్రజలు కూడా తుపాకులు చేతబట్టి యుద్ధరంగంలోకి ఉరుకుతున్నారు. రాజకీయనాయకులు, క్రీడల నేపథ్యం ఉన్నవారు, దివ్యాంగులు, మహిళలు కూడా రష్యాపై పోరుకు సై అంటున్నారు.
తాజాగా, మాజీ మిస్ ఉక్రెయిన్ అనస్తాసియా లెన్నా కూడా కదనక్షేత్రంలో కాలుమోపేందుకు సిద్ధమైంది. ఓ అస్సాల్ట్ రైఫిల్ తో కూడిన ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. కీవ్ లో రష్యా బలగాలను పారదోలేందుకు తుపాకీతో పోరాడతానని అనస్తాసియా చెబుతోంది. మాతృదేశ రక్షణ అత్యంత ప్రాధాన్య అంశమని స్పష్టం చేసింది.
గతంలో అందాల పోటీల విజేతగా నిలిచిన అనస్తాసియా స్లావిస్తిక్ యూనివర్సిటీ నుంచి మార్కెటింగ్ మేనేజ్ మెంట్ పట్టా అందుకుంది. పలు దేశాల్లో ఆమె పీఆర్ మేనేజర్ గా వ్యవహరించింది.
కాగా, కీవ్ వీధుల్లో ఇప్పటికీ రష్యా దళాలతో ఉక్రెయిన్ బలగాలు తీవ్ర పోరు కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. యుద్ధం నేపథ్యంలో కీవ్ లో కర్ఫ్యూ విధించారు. పౌరులు ఎవరూ బయటికి రారాదని, ఒకవేళ ఎవరైనా వీధుల్లో కనిపిస్తే వారిని శత్రుదేశ సైనికులుగా భావించే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
అటు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అణ్వస్త్ర విభాగాలను అప్రమత్తం చేయడంపై అమెరికా స్పందించింది. అణ్వస్త్ర దాడుల నిరోధక వ్యవస్థలను సిద్ధం చేయడం ద్వారా పుతిన్ కొత్త బెదిరింపులకు దిగుతున్నాడని వైట్ హౌస్ విమర్శించింది.