బెలారస్ లో రష్యా అణ్వాయుధాల పార్కింగ్.. !
- అణు రహిత హోదా వదులుకునేందుకు సిద్ధం
- రాజ్యాంగ సవరణకు 65 శాతం ప్రజల మద్దతు
- ఉక్రెయిన్ పై యుద్ధానికీ సిద్ధమవుతున్న బెలారస్!
రష్యాకు మద్దతుగా ఉక్రెయిన్ పొరుగు దేశం బెలారస్ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే తమ భూభాగం నుంచి ఉక్రెయిన్ పై దాడికి రష్యా దళాలను బెలారస్ అనుమతించింది. దీనికితోడు రష్యా అణ్వాయుధాలను పార్క్ చేసుకునేందుకు సైతం బెలారస్ అనుమతించనుంది. ఇందుకు నిదర్శనంగా బెలారస్ అణు రహిత దేశం హోదాకు దూరమయ్యేందకు సిద్ధమైంది. దీనిపై రాజ్యాంగ సవరణను ఆమోదించింది. దీనికి 65.16 శాతం ప్రజల ఆమోదం లభించినట్టు కీవ్ ఇండిపెండెంట్ పత్రిక ప్రచురించింది.
బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో తనకున్న విస్తృతాధికారాలను వినియోగించుకోనున్నారు. మరింత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే.. ఉక్రెయిన్ పై రష్యాకు మద్దతుగా బెలారస్ కూడా త్వరలోనే యుద్ధానికి దిగుతుందంటూ వార్తలు వస్తున్నాయి. మొదటి రవాణా యుద్ధ విమానం బెలారస్ ప్యారా ట్రూపర్లను కదనరంగానికి తీసుకెళ్లనుందని కీవ్ ఇండిపెండెంట్ కథనం పేర్కొంది.
బెలారస్ లో చర్చలకు రష్యా ముందుకు రాగా, తొలుత నిరాకరించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ.. ఆదివారం రాత్రి అందుకు అంగీకారం తెలిపారు. అణ్వాయుధ ప్రయోగానికి సిద్ధం కావాలంటూ పుతిన్ తన సైన్యాన్ని అప్రమత్తం చేయడంతో ఉక్రెయిన్ దారికి వస్తున్నట్టు తెలుస్తోంది.