సీఎం జగన్ ,టీడీపీ నేత అచ్చన్న మధ్య ఆశక్తికర సంభాషణ ….
గతంలో మీరూ అదే చేశారుగా అన్న అచ్చెన్న.. నిరూపిస్తే రాజీనామా చేస్తానన్న జగన్!
-గవర్నర్ ప్రసంగం ప్రతులను చింపేసిన టీడీపీ సభ్యులు
-టీడీపీ తీరును తీవ్రంగా తప్పుబట్టిన సీఎం జగన్
-గతంలో తాను అలా ప్రవర్తించినట్టు నిరూపించమని సవాల్
-మీరు చేశారని నేను అనడం లేదన్న అచ్చెన్న
-జగన్… అచ్చెన్నాయుడు మధ్య సరదా సంభాషణ
-స్పీకర్ సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం
-అచ్చెన్నాయుడు వస్తుండగా ‘అచ్చెన్న కమింగ్ బ్యాక్’ అన్న జగన్
-‘అసెంబ్లీ ఉన్నప్పుడు రావాలిగా’ అన్న అచ్చెన్న
-సమావేశంలో విరిసిన నవ్వులు
ఏపీ అసెంబ్లీలో నిన్న గందరగోళ పరిణామాలు చేటుచేసుకున్న తర్వాత నిర్వహించిన బీఏసీ సమావేశంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య నవ్వులు విరబూసే ఘటన చోటుచేసుకుంది. బీఏసీ సమావేశంలో ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మధ్య సరదా సంభాషణ చోటుచేసుకుంది. స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన శాసనసభ బీఏసీ గదిలో సమావేశం నిర్వహించారు.
గదిలోకి అచ్చెన్నాయుడు ప్రవేశిస్తున్న సమయంలో ‘‘అచ్చెన్న కమింగ్ బ్యాక్’’ అంటూ జగన్ సరదాగా వ్యాఖ్యానించారు. దీనికి వెంటనే స్పందించిన అచ్చెన్న.. ‘‘అసెంబ్లీ ఉన్నప్పుడు రావాలి కదా’’.. ఇందులో కమింగ్ బ్యాక్ ఏముంది? అనగానే అక్కడున్న వారందరూ నవ్వేశారు.
అసెంబ్లీలో నిన్న చోటుచేసుకున్న పరిణామాలపై ముఖ్యమంత్రి జగన్ తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రతిపక్షమైన టీడీపీ తీరును తప్పుబట్టారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగం సందర్భంగా టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో సభలో గందరగోళం ఏర్పడింది. ప్రసంగం ప్రతులను టీడీపీ సభ్యులు చించివేశారు. సభలో నినాదాలు చేశారు. అయినప్పటికీ, గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.
టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యాంగ హోదాలో ఉన్న గవర్నర్‌ను అవమానించడం సరికాదని, కనీసం ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వాలని, అలాంటిది కాగితాలు చించి ఆయనపై విసరడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం అనంతరం నిన్న జరిగిన శాసనసభ వ్యవహారాల సలహా మండలి (బీఏసీ) సమావేశంలో ఇదే అంశాన్ని జగన్ ప్రస్తావించారు. సమావేశానికి హాజరైన అచ్చెన్నాయుడిని ప్రశ్నించారు. దీంతో ఇద్దరి మధ్య సంభాషణ ఇలా సాగినట్టు సమాచారం.
జగన్: చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదు. మీ (టీడీపీ సభ్యుల) తీరు అసెంబ్లీ పవిత్రతను నాశనం చేసేలా ఉంది.
అచ్చెన్నాయుుడు: గతంలో మీరూ ఇదే పని చేశారన్న సంగతిని గుర్తు చేసుకోండి.
జగన్: నేను చేసినట్టు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తాను. మంత్రిమండలిని కూడా రద్దు చేస్తా.
అచ్చెన్న: గవర్నర్ ప్రసంగానికి నిరసన తెలపడం అనేది ఇదే మొదటిసారి కాదు.
జగన్: మేమెప్పుడూ అలా చేయలేదు. చేశానని నిరూపిస్తే రాజీనామా చేస్తాను.
అచ్చెన్న: మీరు చేశారని నేను అనడం లేదు. గవర్నర్ ప్రసంగానికి నిరసన తెలపడం గతంలోనూ జరిగిందని చెప్పడమే నా ఉద్దేశం.