ఓట్ల లెక్కింపునకు ముందే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారు: అఖిలేశ్ యాదవ్ తీవ్ర ఆరోపణలు!
-ఎన్నికల కమిషన్‌ను తాము నమ్మడం లేదన్న అఖిలేశ్
-కౌంటింగ్‌కు ముందే ఈవీఎంలను మార్చారని ఆరోపణ
-ఎన్నికల అధికారులతో బీజేపీ కుమ్మక్కయిందన్న అఖిలేశ్
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలపై ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నాటికి విడతల వారీ పోలింగ్ ముగియగా..ఈ నెల 10న కౌంటింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లను చేస్తోంది. ఇలాంటి కీలక సమయంలో అఖిలేశ్ మంగళవారం నాడు మీడియా ముందుకు వచ్చి కేంద్ర ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర ఎన్నికల కమిషన్‌ను తాము నమ్మడం లేదని సంచలన వ్యాఖ్య చేసిన అఖిలేశ్.. ఓట్ల లెక్కింపునకు ముందే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని ఆరోపించారు. అంతేకాకుండా ఎన్నికల కమిషన్ అధికారులే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల అధికారులతో బీజేపీ నేతలు కుమ్మక్కయ్యారని ఆయన మరో సంచలన వ్యాఖ్య చేశారు. ఎన్నికల్లో మరోమారు బీజేపీనే విజయం వరించనుందన్న ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో ఏకంగా ఎన్నికల సంఘంపైనే అఖిలేశ్ అరోపణలు గుప్పించడం ప్రాధాన్యం సంతరించుకుంది.