- చిన్నారుల కోసం టీకాను అభివృద్ధి చేసిన ఫైజర్
- బుధవారమే ప్రారంభమైన ట్రయల్స్
- మూడు దశల్లో, మూడు వేర్వేరు మోతాదుల్లో ట్రయల్స్
- తర్వాతి దశలో 4,500 మందిపై పరీక్షలు
ఇప్పటి వరకు పెద్దలకు మాత్రమే అందుబాటులో ఉన్న కరోనా టీకాలు త్వరలో పిల్లలకూ అందుబాటులోకి రాబోతున్నాయి. జర్మనీకి చెందిన భాగస్వామ్య సంస్థ బయోఎన్‌టెక్‌తో కలిసి పిల్లలపై టీకా ప్రయోగాలు ప్రారంభించినట్టు ఫైజర్ సంస్థ వెల్లడించింది.
బుధవారమే ట్రయల్స్ ప్రారంభం కాగా, ఇందులో ఆరు నెలల వయసున్న చిన్నారులను కూడా భాగం చేయనున్నట్టు ఫైజర్ ప్రతినిధి షారోన్ క్యాస్టిలో తెలిపారు. మూడు దశల్లో మూడు వేర్వేరు మోతాదులతో 144 మంది వలంటీర్లపై ఈ టీకాను పరీక్షించనున్నారు. తర్వాతి దశలో 4,500 మంది వలంటీర్లపై క్లినికల్ ప్రయోగాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా వారిలో టీకా భద్రత, రోగ నిరోధక శక్తి ప్రతిస్పందనను పరీక్షిస్తారు.
మరోవైపు, చిన్నారుల కోసం పూర్తి సురక్షితమైన టీకాను తయారు చేసినట్టు చైనాకు చెందిన సినోవాక్ అనే ఫార్మాసంస్థ ఇటీవల వెల్లడించింది. తాము అభివృద్ధి చేసిన టీకా 3 నుంచి 17 ఏళ్ల వారిపై సమర్థంగా పనిచేస్తుందని, పూర్తి సురక్షితమని తెలిపింది. అయితే, ఈ టీకాపై మరిన్న ప్రయోగాలు అవసరమని పేర్కొంది.