బెంగాల్ , అస్సోమ్ లలో భారీ పోలింగ్ ఎవరికీ లాభం
సాయంత్రం 6 గంటలకు ముగిసిన పోలింగ్
క్యూలో ఉన్నవారికి ఓటేసే అవకాశం
సాయంత్రం 5 గంటలవరకు బెంగాల్ లో 77.99 శాతం ఓటింగ్
అసోంలో 71.62 శాతం ఓటింగ్
పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నేడు తొలి విడత పోలింగ్ నిర్వహించారు. రెండు రాష్ట్రాలలో భారీ పోలింగ్ నమోదైంది. ఇది ఎవరికీ లాభం ఎవరికీ నష్టం అనే ఆలోచనలు బయలు దేరాయి. చదురు మదురు సంఘటనలు మినహా మొత్తం మీద పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. అయితే పశ్చిమ బెంగాల్ లోని మిడ్నపూర్ జిల్లాలో బీజేపీ కార్యకర్త మరణించారు. సాయంత్రం 6 గంటలతో పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటల సమయానికి క్యూలో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పించారు. కాగా ఈ తొలి విడత పోలింగ్ లో పశ్చిమ బెంగాల్, అసోంలో రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగినట్టు భావిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ లో సాయంత్రం 5 గంటల సమయానికి 77.99 శాతం పోలింగ్ నమోదైంది. బెంగాల్ లో తొలి విడతలో భాగంగా 38 నియోజకవర్గాలకు నేడు పోలింగ్ జరిగింది. అటు అసోంలో సాయంత్రం 5 గంటల సమయానికి 71.62 శాతం ఓటింగ్ జరిగినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.
కాగా పశ్చిమ బెంగాల్ లో పోలింగ్ జరుగుతున్న మిడ్నపూర్ జిల్లాలో ఓ బీజేపీ కార్యకర్త హత్యకు గురయ్యాడు. మంగల్ సోరెన్ అనే వ్యక్తి తన ఇంటి ఎదుటే శవమై కనిపించాడు. ఇది తృణమూల్ శ్రేణుల ఘాతుకమేనని బీజేపీ ఆరోపిస్తోంది.
ఇక, బెంగాల్, అసోం రాష్ట్రాల్లో రెండో విడత ఎన్నికలు ఏప్రిల్ 1న జరగనున్నాయి. బెంగాల్ లో 30, అసోంలో 39 స్థానాలకు పోలింగ్ జరగనుంది.