- హర్యానాలో మాయలేడి మోసాలు
- సతీశ్ అనే వ్యక్తితో మొదటి వివాహం
- అక్కడ్నించి మోసాల ఆట
- జనవరి 1 నుంచి ఈ నెల 26 వరకు వరుస పెళ్లిళ్లు
హర్యానాలో పోలీసులు ఓ నిత్య పెళ్లికూతురిని అరెస్ట్ చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి ఆమె ఇప్పటివరకు ఆరు పెళ్లిళ్లు చేసుకున్నట్టు వెల్లడైంది. ఆమెకు గతంలోనే తొలి వివాహం జరగ్గా, మోసాల బాటపట్టిన ఆమె విడాకులు తీసుకున్నవారు, పెళ్లికాని యువకులను లక్ష్యంగా చేసుకుని వంచనకు పాల్పడుతున్న విషయం పోలీసులు బట్టబయలు చేశారు. నాలుగో భర్త రాజేందర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ యువతిని, ఆమెకు సహకరిస్తున్న మరికొందరిని అరెస్ట్ చేశారు.
విచారణలో ఆమె అన్ని విషయాలు వెల్లడించింది. ఖేదీ కరమ్ షామ్లి ప్రాంతానికి చెందిన సతీశ్ ను మొదటి వివాహం చేసుకున్న ఆ కిలాడీ భామ, అక్కడి నుంచి తన నిత్య కల్యాణానికి తెరలేపింది. ఈ ఏడాది జనవరి 1న రాజస్థాన్ లో రెండో వివాహం, ఫిబ్రవరి 15న మూడో వివాహం, మరో 6 రోజుల తేడాతో రాజేందర్ అనే వ్యక్తిని నాలుగో వివాహం చేసుకుంది. ఇక, కుటానా ప్రాంతానికి చెందిన గౌరవ్ ను ఐదో పెళ్లి చేసుకున్న మాయలాడి… కర్నాలకు చెందిన సందీప్ తో ఆరో వివాహం, మార్చి 26న బుద్వా ప్రాంతానికి చెందిన సుమిత్ ను ఏడో వివాహం చేసుకుంది.
దీనిపై వివిధ సెక్షన్లతో కేసులు నమోదు చేసిన పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. తనకు ఎవరూ లేరని ఆమె నమ్మించేదని, తన వలలో ఎవరైనా పడితే వారిని పెళ్లి వరకు తీసుకువచ్చేదని తెలిసింది. ఈ క్రమంలో ఆమెకు ముఠా సభ్యులు సహాయసహకారాలు అందించేవారు. మొదటి రాత్రే తన పన్నాగం అమలు చేసేది. శోభనం రాత్రే భర్తకు మత్తుమందు ఇచ్చి, అతడు స్పృహకోల్పోయాక డబ్బు, నగలతో పరారయ్యేది.