Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

జన జాతరను తలపిస్తున్న భట్టి పాదయాత్ర!

జన జాతరను తలపిస్తున్న భట్టి పాదయాత్ర!
-ప్రజాసమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న భట్టి
-కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శనాస్త్రాలు …
-కేంద్ర మంత్రివి అడ్డగోలు అబద్ధాలు
-దేశంలో తెలంగాణ అంతర్భాగం కాదా?
-వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనాలి
-ధనిక రాష్ట్రంలో రూ.11 వేల కోట్లు లేవా?
-ధరల పెంపుపై సర్కారుతో సమరమే

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తన సొంత నియోజకవర్గమైన మధిర లో చేపట్టిన పాదయాత్ర జనజాతరను తలపిస్తుంది. తొలుత కొంత స్తబ్దతగా అనిపించినా ,యాత్రకు రోజురోజుకు ప్రజల మద్దతు లభిస్తుండటం విశేషం . అమ్మ,అక్క చెల్లి , అన్న తమ్మడు , పెద్దాయన , అంటూ పలకరింపులతో సాగుతున్న యాత్రకు జననీరాజనాలు పలుకుతున్నారు . ప్రతి గ్రామంలో ప్రజలతో మాట్లాడుతూ ముందుకు సాగుతున్నారు. చేలల్లో కూలీలను ,రైతులను పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు . మండుటెండను సైతం లెక్క చేయకుండా సాగుతున్న ఈ యాత్రకు వివిధ పార్టీలు ప్రజాసంఘాలు మద్దతు పలుకుతున్నాయి.

వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రులు తెలంగాణ బీజేపీ ఎంపీలు అడ్డగోలుగా అబద్ధాలు ఆడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆ తరువాత కేంద్రంతో యుద్ధం చేయాలని డిమాండ్ చేశారు. భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మంగళవారం చింతకాని మండలం నేరడ, గంగమ్మ దేవాలయం, కోమట్లగూడెం, నాగలిగొండ, పొద్దుటూరు గ్రామాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో సిపిఐ తెలుగుదేశం కార్యకర్తలు స్వాగతం పలికి సంఘీభావం ప్రకటించారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభలలో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం పంజాబ్ ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసి తెలంగాణలో ఎందుకు కొనడం లేదని నిలదీశారు. తెలంగాణ దేశంలో అంతర్భాగం కాదా అని మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు అభివృద్ధి పేరిట రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద 12 వేల కోట్ల రూపాయలు లేవా అని ప్రశ్నించారు. లక్షల కోట్లు వెచ్చించి ప్రాజెక్టులు కట్టామని ప్రగల్భాలు పలుకుతున్న టిఆర్ఎస్ ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయడానికి ఎందుకు రాజకీయం చేస్తున్నారని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దొంగ నాటకాలు ఆడుతూ రైతుల జీవితాలతో చెలగాటం ఆడటం మానుకోవాలన్నారు .

వరికి ప్రత్యామ్నాయంగా పత్తి, మిర్చి ,మొక్కజొన్న పంటలను సాగు చేయాలని ప్రచారం చేసిన పాలకులు కల్తీ విత్తనాలు అరికట్టడంలో ఘోరంగా వైఫల్యం చెందారని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల రైతులు ఈ ఏడు చాలా తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. కల్తీ విత్తనాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Related posts

ఆస్తులను కాపాడుకునేందుకే బీజేపీలోకి ఈటలపై గంగుల ఫైర్!

Drukpadam

కాంగ్రెస్ ను వీడే ప్రసక్తే లేదు…కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Drukpadam

పాలేరు నియోజకవర్గం లో ఎవరు గెలవాలో నిర్ణయించేది కమ్యూనిస్టులే … కూనంనేని ,తమ్మినేని

Drukpadam

Leave a Comment