ఆస్తులను కాపాడుకునేందుకే బీజేపీలోకి ఈటలపై గంగుల ఫైర్!
-మంత్రిగా ఉన్నప్పుడు ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా?
-టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు గుర్తుకు రాలేదా?
-ఆయన రాజకీయ సమాధిని ఆయనే కట్టుకున్నారు
టీఆర్ఎస్ పార్టీకి మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈరోజు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ లో ఉన్నన్ని రోజులు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఈటలకు గుర్తుకు రాలేదా? అని ఆయన ప్రశ్నించారు. మంత్రిగా ఉన్నన్నాళ్లు ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా? అని మండిపడ్డారు. ఆస్తులను కాపాడుకోవడం కోసమే ఈటల బీజేపీలో చేరుతున్నారని దుయ్యబట్టారు.
హుజురాబాద్ నియోజకవర్గంలో బలంగా ఉన్నది టీఆర్ఎస్ పార్టీనే అని, ఈటల కాదని గంగుల అన్నారు. కేసీఆర్ మీద అభిమానంతోనే హుజురాబాద్ ప్రజలు ప్రతి సారి టీఆర్ఎస్ ను గెలిపించారని చెప్పారు. సీఎం కార్యాలయంలో బలహీనవర్గాలకు చెందిన ఐఏఎస్ అధికారులు లేరు…. అందువల్ల తాను మంత్రిగా ఉండబోనని గతంలో ఈటల ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఈటల ఆయన రాజకీయ సమాధిని ఆయనే కట్టుకున్నారని చెప్పారు.