ఏపీలో 26 జిల్లాలకు ఎస్పీలు, కలెక్టర్ల నియామకం.. ఉత్తర్వులు జారీ చేసిన సమీర్ శర్మ
- ఆంధ్రప్రదేశ్‌లో అమల్లోకి రేపటి నుంచి కొత్త జిల్లాలు
- 13 జిల్లాల కలెక్టర్లలో నలుగురు తప్ప మిగతా వారిని కదల్చని ప్రభుత్వం
- విశాఖ పోలీస్ కమిషనర్‌గా శ్రీకాంత్
- పలువురు ఐఏఎస్‌ల బదిలీ
ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి కొత్త జిల్లాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో ప్రభుత్వం గత రాత్రి 26 జిల్లాలకు కలెక్టర్లను, ఎస్పీలను నియమించింది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల కలెక్టర్లలో నలుగురిని తప్ప మిగతా 9 మందిని వారు పనిచేస్తున్న చోటే కొనసాగించింది. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్లుగా ఉన్న వివేక్ యాదవ్, నివాస్, ప్రవీణ్ కుమార్, హరికిరణ్‌లను రాష్ట్రస్థాయి పోస్టుల్లోకి బదిలీ చేసింది.
అలాగే, ప్రస్తుతం జాయింట్ కలెక్టర్లుగా, మునిసిపల్ కమిషనర్లుగా, వివిధ రాష్ట్రస్థాయి పోస్టుల్లో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారుల్లో కొందరిని కలెక్టర్లుగా నియమించింది. కొందరు సంయుక్త కలెక్టర్లను వారు పనిచేస్తున్న చోటే కొనసాగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం జేసీ (హౌసింగ్), జేసీ (గ్రామ, వార్డు) సచివాలయాలుగా పనిచేస్తున్న వారిలో కొందరిని కొత్త జిల్లాలకు జేసీలుగా నియమించింది. కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకంతోపాటు పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. కాటమనేని భాస్కర్‌ను రవాణాశాఖ కమిషనర్‌గా, వివేక్ యాదవ్‌ను సీఆర్‌డీఏ కమిషనర్‌గా, చేవూరి హరికిరణ్‌ను వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌గా, జె.నివాస్‌ను వైద్య, ఆరోగ్యశాఖ డైరెక్టర్‌గా, కేఆర్‌బీహెచ్ఎన్ చక్రవర్తిని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అలాగే, ప్రస్తుతం దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న జి.వాణీమోహన్‌ను యువజన వ్యవహారాలు, పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. విశాఖ పోలీస్ కమిషనర్‌గా శ్రీకాంత్, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్‌గా మనీష్‌కుమార్ సిన్హాను నియమించింది.