- తిరుపతి బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ
- ఆమె తరపున ప్రచారానికి తెలంగాణ బీజేపీ నేతలు
- ఏప్రిల్ 14న తిరుపతి ర్యాలీకి బండి సంజయ్
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తిరుపతిలో తమ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయనున్నట్టు తెలుస్తోంది. తిరుపతి ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలగా ఉంది.
ఇందులో భాగంగా, ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇప్పటికే అక్కడ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బీజేపీ అగ్రనేతలు సహా పలువురు సినీ స్టార్లు కూడా తిరుపతిలో ప్రచారం చేయనున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, పలువురు తెలంగాణ బీజేపీ నేతలు కూడా ప్రచారంలో పాల్గొంటారని సమాచారం.
ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రెండు రోజులపాటు తిరుపతిలో తమ పార్టీ అభ్యర్థి రత్నప్రభ తరపున ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఏప్రిల్ 14న తిరుపతిలో జరిగే బీజేపీ ర్యాలీలోనూ ఆయన పాల్గొంటారని తెలుస్తోంది.