ఇది ప్రజల మనస్తత్వంపై ప్రభావం చూపుతుంది
ఉచిత సేవలతో బతికేయొచ్చనే అపోహలు ప్రజల్లో కలుగుతున్నాయి
- మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారిస్తే మంచిదన్న కోర్టు
రాజకీయ పార్టీల ఉచిత హామీలు ప్రజలను బద్దకస్తులు చేయటానికే నని మద్రాస్ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల్లో గెలవడానికి వాడుకునే ప్రధాన ప్రచారాస్త్రం… ఉచితాలు. అది ఉచితంగా ఇస్తాం… ఇది ఉచితంగా ఇస్తాం అంటూ దాదాపు అన్ని పార్టీలు హామీలు ఇస్తుంటాయి. తమిళనాడులో అయితే దీని మోతాదు మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ ఉచిత హామీలపై మద్రాస్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
ఉచితాలను అందిస్తూ ప్రజలను మరింత బద్ధకస్తులుగా చేస్తున్నారని హైకోర్టు విమర్శించింది. హామీల విషయంలో అన్ని పార్టీలు ఇతర పార్టీల కంటే మెరుగ్గా ఉండేందుకే ప్రయత్నిస్తాయని తెలిపింది. ఇది ప్రజలు కష్టపడే మనస్తత్వంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించింది.
ప్రభుత్వం అందించే ఉచిత సేవలతో బతికేయొచ్చనే అపోహలు ప్రజల్లో కలుగుతున్నాయని తెలిపింది. దీనికి బదులు మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారిస్తే బాగుంటుందని చెప్పింది. దురదృష్టవశాత్తు పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలకు ఉద్యోగాల సృష్టి, అభివృద్ధికి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది.