అయ్యో పాపం.. కుమారుడితో ఆడుకుంటూ సముద్రపు అలల్లో కొట్టుకుపోయిన తండ్రి..
ఒడిశాలోని పూరీ బీచ్ లో విషాదం
కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లిన బన్సీధర్
మింగేసిన పెద్ద అల.. కొనసాగుతున్న గాలింపు
ఒడిశాలోని పూరీ బీచ్ లో విషాదం జరిగింది. తన కుమారుడితో సరదాగా బీచ్ లో ఆడుకుంటున్న ఓ తండ్రి.. ఆ అలల్లోనే కొట్టుకుపోయాడు. ఆ కుటుంబానికి తీరని విషాదం మిగిల్చాడు. బాలేశ్వర్ కు చెందిన బన్సీధర్ బెహర.. తన కుటుంబ సభ్యులతో కలిసి నిన్న పూరీ బీచ్ కు వెళ్లాడు.
కుమారుడితో కలిసి సముద్రపు అలల్లో అతడు స్నానం చేయసాగాడు. బంధువుల్లో ఒకరు ఆ వీడియోను తీశారు. అయితే, ఇంతలోనే ఓ పెద్ద అల అతడిని మింగేసింది. లోపలికి తీసుకెళ్లిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు అప్రమత్తమైనా ఫలితం దక్కలేదు. కుమారుడు (12) సురక్షితంగానే ఉన్నా.. ఇప్పటికీ గల్లంతైన బన్సీధర్ జాడ మాత్రం దొరకలేదు.
ప్రస్తుతం అతడి మృతదేహం కోసం సుశిక్షితులైన డైవర్లు, ఫైర్ సర్వీస్ సిబ్బంది గాలింపు చేస్తున్నారు. సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కాగా, బాలేశ్వర్ లో ఓ చిన్న వ్యాపారం చేసుకుంటూ అతడు కుటుంబాన్ని పోషిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అతడు కొట్టుకుపోయిన వీడియో వైరల్ అయింది.