Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ప్రశ్నిస్తే పీడి కేసులు …నిలదీస్తే ఐటీ, ఈడీ దాడులపై భగ్గుమన్న భట్టి

ప్రశ్నిస్తే పీడి కేసులు …నిలదీస్తే ఐటీ, ఈడీ దాడులపై భగ్గుమన్న భట్టి
-ప్రతిపక్షాలపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్న రాజ్యం
-కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్
-359.7 కిలోమీటర్లు పూర్తిచేసుకున్న పాదయాత్ర

ప్రజా సంక్షేమం కోసం పని చేయాల్సిన రాజ్యం ప్రశ్నించే వారిని నిర్బంధించే పని చేస్తున్నదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులపై కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఐటీ, ఈడీ దాడులు చేసి భయపెట్టిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో అక్రమంగా పీడీ యాక్ట్ కేసులు పెట్టించి వేధింపులకు పాల్పడుతున్నదని ధ్వజమెత్తారు. ప్రజాసమస్యల పరిష్కారం కొరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర 27వ రోజు గురువారం మధిర మండలం చిలుకూరు, దొడ్డ దేవరపాడు, వెల్లంకి సర్కిల్, తొండల గోపవరం, తొర్లపాడు, సాయిపురం గ్రామాల మీదుగా ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామానికి చేరుకుంది.

చిలుకూరు గ్రామ సర్పంచ్ సంధ్య వంశీలు భారీ గజమాలతో సీఎల్పీ నేత భట్టి దంపతులను సత్కరించారు. మహిళలు మంగళ హారతులు పట్టి వీర తిలకం దిద్దారు. ఈ సందర్భంగా మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అనంతరం ఆయా గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. సందర్భంగా ఏర్పాటు చేసిన సభలలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. టిఆర్ఎస్ నాయకుల అవసరాలు తీర్చడం కోసం పోలీసులు రాష్ట్రంలో పని చేస్తున్నట్లుగా కనిపిస్తోందని విమర్శించారు. పోలీసు వ్యవస్థ పైన టిఆర్ఎస్ నాయకుల ఆజమాయిషీ, పెత్తనం చెలాయిస్తూ రాజకీయ అవసరాల కోసం ప్రత్యర్థులను, ప్రశ్నించిన వారిని వెంటాడి వేటాడి రాజకీయ కక్ష సాధింపుతో అక్రమ పీడీ యాక్ట్ కేసులు పెట్టిస్తున్నారని, సమాజానికి మంచిది కాదని సూచించారు. పీడీ యాక్ట్ కేసులు పెట్టేంత నేరం ప్రతిపక్ష నాయకులు ఏం చేశారో చెప్పకుండా పోలీసులు పెడుతున్న అక్రమ కేసుల పై న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు.
పోలీసు పోలీస్ గా చేయాల్సిన బాధ్యతను విస్మరించడం వల్లనే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమవుతాయని విమర్శించారు .

ప్రశ్నించే వారిని ప్రభుత్వం పోలీసులతో వేధింపులకు గురి చేయడం వల్ల వేధింపులకు తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్థితి తాజాగా ఖమ్మంలో సాయి గణేష్, రామాయంపేటలో సంతోష్ అతని తల్లి పద్మలు సజీవదహనం చేసుకున్న ఘటనలు వెలుగుచూశాయన్నారు. రాజకీయ పరమైన సిఫారసులతో రాష్ట్రంలో పోలీసుల పోస్టింగులు జరగడం వల్లనే పోలీసులు పాలకపక్ష పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ విధానం తెలంగాణ సమాజానికి మంచిది కాదని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం నేరమ్మన్నట్టుగా పాలక పక్షాలు వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న బాధలను చూసి చలించి బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించడానికి నడుం బిగించానని తెలిపారు. ప్రభుత్వం ప్రయోగిస్తున్న నిర్బంధాలను ఎదురొడ్డి ప్రజాసమస్యల పరిష్కారం కొరకు పాదయాత్ర చేపట్టినట్లు వివరించారు. గత 27 రోజులుగా మధిర నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో పాదయాత్ర చేసిన గ్రామాల్లో వందల సమస్యలు తన దృష్టికి ప్రజలు తీసుకువచ్చారని చెప్పారు. తన దృష్టికి వచ్చిన సమస్యలతో పాటు ప్రజలు ఇచ్చిన విజ్ఞప్తుల పరిష్కారం కొరకు ప్రజల గొంతుక గా అసెంబ్లీలో తన గలం వినిపిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ మొండి వైఖరి అవలంబించి నిర్లక్ష్యం వహిస్తే ప్రగతి భవన్ గేటు బద్దలు కొట్టుకుని వెళ్ళీ సీఎంను నిలదీసి ప్రజా సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తానని వెల్లడించారు

359.7 కిలోమీటర్లు పూర్తిచేసుకున్న పాదయాత్ర

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర 27 రోజుల పాటు ముదిగొండ చింతకాని బోనకల్లు మధిర మండలాల్లో 84 గ్రామ పంచాయతీల్లో కొనసాగింది. దాదాపుగా
359.7 కిలోమీటర్లు పూర్తిచేసుకున్నది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజల నుంచి వ్యక్తిగత సమస్యలతోపాటు గ్రామ సమస్యల సంబంధించిన పత్రాలు పెద్ద ఎత్తున వచ్చాయి. ప్రతి గ్రామంలో ఇండ్లు, పింఛన్లు, రేషన్ కార్డులు, ఇంటి స్థలాలు, రైతుబంధు, దళిత బంధు, రైతు బీమా, ధరణి సమస్యలను పరిష్కరించాలని వచ్చిన విజ్ఞప్తుల ను భట్టి విక్రమార్క స్వీకరించారు. అదేవిధంగా పాఠశాల లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, గ్రామాల్లో సిసి రోడ్లు, బిటి రోడ్లు, చెరువుల మరమ్మతులు, చెక్ డ్యాం నిర్మాణాలు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు సీఎల్పీ నేతకు మొరపెట్టుకున్నారు.

సీఎల్పీ నేత భట్టి పాదయాత్ర కు విహెచ్ సంఘీభావం

ప్రజా సమస్యల పరిష్కారం కొరకై తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క గారు చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు పీసీసీ మాజీ అధ్యక్షులు, మాజీ ఎంపీ వి.హెచ్ హనుమంతరావు సంఘీభావం ప్రకటించి తన మద్దతు తెలిపారు. గురువారం మధిర మండలం తొండల గోపవరం గ్రామానికి చేరుకొని భట్టి పాదయాత్రకు స్వాగతం పలికారు. భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రను అభినందిస్తూ ఆయన వెంట పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో అడుగులో అడుగులు వేస్తూ కదం తొక్కారు. ఆయన వెంట స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి రాయల నాగేశ్వరరావు, ఐ ఎన్ టి సి ఖమ్మం జిల్లా అధ్యక్షులు కొత్త సీతారాములు, పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కన్వీనర్ బుల్లెట్ బాబు తదితరులు పాల్గొన్నారు.

అంతకుముందు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో విహెచ్ పాల్గొని కేసీఆర్ ప్రభుత్వంలో పోలీస్ రాజ్యం నడుస్తుందని ధ్వజమెత్తారు . ఖమ్మంలో మంత్రి ప్రోద్బలంతోనే సాయి గణేష్ పై పోలీసులు కేసులు పెట్టి వేదించినందునే ఆయన మరణించారని దీనిపై స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ పై కేసు నమోదు చేయాలనీ డిమాండ్ చేశారు .

 

Related posts

కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై మండిప‌డ్డ రేవంత్ రెడ్డి!

Drukpadam

అమ్మ జెడి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ బిడ్డింగ్ వెనక ఇంత రాజకీయం ఉందా …?

Drukpadam

తెలంగాణ గడ్డపై ‘వైఎస్సార్ తెలంగాణ పార్టీ’.ఆవిర్భావం :ప్రకటించిన షర్మిల…

Drukpadam

Leave a Comment