- అనకాపల్లి జిల్లా పైడివాడ అగ్రహారంలో ఇళ్ల పట్టాల పంపిణీ
- 16 నెలల తర్వాత పేదల కల సాకారమవుతోందన్న సీఎం
- గజం విలువ రూ.12 వేలుందని వ్యాఖ్య
- 17 వేల జగనన్న కాలనీలు నిర్మిస్తామని వెల్లడి
అనకాపల్లి జిల్లాలో ఏపీ సీఎం జగన్ ఇవాళ పర్యటించారు. లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. 1.23 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీని ఆయన సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం నుంచి ప్రారంభించారు. అక్కడ 300 ఎకరాల్లో పేదలకు 10,228 ప్లాట్లను అందజేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. కాలనీలో ఇళ్లతో పాటు స్కూళ్లు, విలేజ్ క్లినిక్ లు, అంగన్వాడీ సెంటర్ల వంటి వాటినీ ఏర్పాటు చేస్తామన్నారు. మార్కెట్ యార్డు, సచివాలయ నిర్మాణమూ జరుగుతుందన్నారు.
ఇక్కడ ఇంటి స్థలం విలువే రూ.6 లక్షలు అని కలెక్టర్ చెప్పారన్నారు. ఇక్కడ గజం స్థలం విలువ రూ.12 వేలుందని, ఒక్కో లబ్ధిదారుల కుటుంబానికి 50 గజాల చొప్పున స్థలం, అందులో ఇల్లు కట్టించి ఇస్తున్నామని జగన్ పేర్కొన్నారు. 16 నెలల క్రితమే లబ్ధిదారులకు ఇళ్లు ఇచ్చే పథకానికి బాటలు వేశామని, ఇప్పుడు పేదల కల సాకారమయ్యేలా ఇళ్ల పట్టాలు అందించడం ఆనందంగా ఉందని అన్నారు. అయితే, జగన్ కు ఎక్కడ మంచి పేరొస్తుందో.. జగన్ కు ప్రజలు ఎక్కడ మద్దతిస్తారోనంటూ కొందరు కడుపు మంటతో రగిలిపోతున్నారని చెప్పుకొచ్చారు. కోర్టు కేసులు వేశారన్నారు.
ఆ కోర్టు కేసులు ఎప్పుడెప్పుడు పోతాయా? అక్కచెల్లెమ్మలకు ఎప్పుడు మంచి చేద్దామా? అని 489 రోజులు వేచి చూశానన్నారు. వారానికోసారి అడ్వొకేట్ జనరల్ తో మాట్లాడుతూనే ఉన్నానని గుర్తు చేశారు. దేవుడి దయ వల్ల ఇప్పుడు ఆ సమస్య తీరిపోయిందని చెప్పారు.
ఇల్లు అంటే ప్రతి ఒక్కరికీ శాశ్వత చిరునామా ఇచ్చినట్టు అని జగన్ అన్నారు. అందరికీ సొంతిల్లు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం మంచి చేస్తుంటే అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో కనీసం 5 లక్షల ఇళ్లు కూడా కట్టలేదని, కానీ, తమ ప్రభుత్వం మాత్రం 30.7 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు.
రాష్ట్రంలో మొత్తం 17 వేల జగనన్న కాలనీలను నిర్మించబోతున్నామని, రెండో దశ నిర్మాణాలను ప్రారంభించాల్సిందిగా అధికారులను ఆదేశించామని తెలిపారు. ఇళ్లు రాని అర్హులు ఎవరైనా ఉంటే సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఒకటిన్నర సెంట్లు, పట్టణాల్లో ఒకటి నుంచి ఒకటిన్నర సెంట్ల మధ్య స్థలాలను ఇస్తున్నామన్నారు.
సుమారు 3.03 లక్షల మంది ఇల్లు మంజూరు పత్రాలను ఇస్తామన్నారు. 25 లక్షల మందికి ఇళ్లు కట్టించి ఇస్తామని పేర్కొన్నారు.