లక్ష్మణ రేఖను దాటడం మంచిది కాదు: న్యాయమూర్తులకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సలహా!
-ఢిల్లీలో సీఎంలు, హైకోర్టుల సీజేలతో సమావేశం
-కీలక ప్రసంగం చేసిన జస్టిస్ ఎన్వీ రమణ
-శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు కలిసి పనిచేయాలని సూచన
-పిల్‌లు దుర్వినియోగమవుతున్నాయని జస్టిస్ ఎన్వీ రమణ ఆందోళన
న్యాయమూర్తులు విధి నిర్వహణలో లక్ష్మణ రేఖను గుర్తుంచుకోవాలని, దానిని దాటడం మంచిది కాదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో శనివారం ఢిల్లీలో ప్రారంభమైన సదస్సులో జస్టిస్ ఎన్వీ రమణ కీలక ప్రసంగం చేశారు.
న్యాయమూర్తులు విధి నిర్వహణలో తమ పరిధిని గుర్తుంచుకోవాలని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. శాసన, కార్య నిర్వాహక, న్యాయ వ్వవస్థలకు వేర్వేరు అధికారాలు ఉన్నాయన్న జస్టిస్ ఎన్వీ రమణ.. ప్రజాస్వామ్యం బలోపేతానికి మూడు వ్యవస్థలు కలిసి పనిచేయాల్సి ఉందని తెలిపారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్) దుర్వినియోగమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. పిల్‌లను కొందరు తమ వ్యక్తిగత వ్యాజ్యాలుగా పరిగణిస్తున్నారని చెప్పారు.
కోర్టుల్లో స్థానిక భాషలకు ప్రాధాన్యమివ్వాలి… సీఎంలు, హైకోర్టు సీజేల సదస్సులో మోదీ!
దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆయా రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ల సమావేశం ఢిల్లీలో శనివారం ఉదయం ప్రారంభమైంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రారంభించిన ఈ సమావేశంలో ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. కోర్టుల్లో స్థానిక భాషకే ప్రాధాన్యమివ్వాలని మోదీ పిలుపునిచ్చారు.
డిజిటల్ ఇండియా ప్రగతిలో అన్ని రాష్ట్రాల సీఎంలు, హైకోర్టుల సీజేలు తమతో కలిసి రావాలని ప్రధాని మోదీ కోరారు. న్యాయ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. సమస్యల పరిష్కారంలో న్యాయ వ్యవస్థ పాత్ర కీలకమని మోదీ పేర్కొన్నారు. దేశంలో డిజిటల్ లావాదేవీలు అసంభవమని కొందరు అన్నారన్న మోదీ… నేడు ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ లావాదేవీలు జరుగుతున్న దేశంగా భారత్ నిలిచిందని తెలిపారు.