టీమిండియా యువ క్రికెటర్ రిషభ్ పంత్ ఆట అంటే తనకు పిచ్చని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపాడు. రిషభ్ పంత్ నిఖార్సైన మ్యాచ్ విన్నరని కొనియాడాడు. అలాగే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆటను తాను ఆస్వాదిస్తానని చెప్పాడు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ బౌలింగ్‌ను కూడా ఇష్టపడతానని పేర్కొన్నాడు. శార్దూల్ ఠాకూర్ అన్నా ఇష్టమేనని, అతనికి ధైర్య సాహసాలు ఎక్కువని ప్రశంసించాడు. వాస్తవానికి బీసీసీఐ అధ్యక్షుడిగా ఆటగాళ్లలో ఎవరు ఇష్టమో చెప్పకూడదన్నాడు.
ఒకరు పోతే మరొకరు..
తాజాగా క్లాస్ ప్లస్ యూట్యూబ్ షోలో పాల్గొన్న దాదా.. హోస్ట్ అడిగిన ప్రశ్నలన్నిటికీ ఓపికగా సమాధానాలిచ్చాడు. ‘భారత్‌లో ఎంతోమంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. సునీల్ గవాస్కర్ ఆడుతున్నప్పుడు ఆయన తర్వాత ఏమవుతుందోనని అభిమానులు ఆందోళన చెందారు. కానీ సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే వచ్చారు. వాళ్లు వీడ్కోలు పలికాక విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషభ్ పంత్ బ్యాట్ అందుకున్నారు. క్రికెట్ పరంగా దేశంలో ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నారు. ఏ తరంలోనైనా ఈ దేశం అత్యుత్తమ క్రికెటర్లను అందించగలదు’ అని గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు.
ఆ పర్యటనే నన్ను మార్చింది..
గంగూలీ 1992లో భారత్ జట్టు తరఫున ఆస్ట్రేలియాలో పర్యటించాడు. ఒక్క మ్యాచ్‌లోనూ అతనికి అవకాశం రాలేదు. ఆ తర్వాత నాలుగేళ్లు దేశవాళీ క్రికెట్లో కష్టపడి 1996లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. కానీ ఆసీస్ పర్యటనే తనను మెరుగైన క్రికెటర్‌గా మలిచిందని తాజా గంగూలీ పేర్కొన్నాడు. ‘నా 1992 సిరీస్‌ను వైఫల్యంగా భావిస్తాను. నిజం చెప్పాలంటే నాకు అవకాశాలు ఎక్కువేం రాలేదు. అప్పుడు నేను యువకుడిని. ఏదేమైనా ఆ సిరీస్ నన్ను మెరుగైన క్రికెటర్‌గా మార్చింది. మానసికంగా, శారీరకంగా పటిష్టంగా మారాను.
..
వైపల్యలతోనే అంతర్జాతీయ క్రికెట్ అర్థమైంది. ఒత్తిడిని ఎదుర్కోవడం నేర్చుకున్నాను. 1996లో ఇంగ్లండ్‌కు వెళ్లినప్పుడు నేను మరింత బలంగా ఉన్నాను. అంతర్జాతీయ క్రికెట్లో పరుగులు చేయాలంటే ఏం కావాలో తెలుసు. ఆ తర్వాత మరో నాలుగేళ్లు దేశవాళీ క్రికెట్ ఆడాను. వైఫల్యాలు మరింత మెరుగైన క్రికెటర్‌గా మారుస్తాయి’ అని దాదా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తాను పూర్తి స్థాయిలో ఫిట్‌గా ఉన్నానని అన్ని పనులు చేసుకుంటున్నానని తెలిపాడు. ఇటీవలే దాదాకు గుండె పోటు వచ్చిన విషయం తెలిసిందే. వైద్యులు శస్త్రచికిత్స చేసి స్టంట్స్ వేయడంతో అతను పూర్తిగా కోలుకున్నాడు.