నా భార్య చచ్చిపోతోంది…. దయచేసి ఆసుపత్రిలో చేర్చుకోండి’ అంటూ ఢిల్లీలో కొవిడ్ ఆసుపత్రి వెలుపల భర్త ఆవేదనా పూరిత అభ్యర్ధన
కరోనా నేపథ్యంలో హృదయవిదారక దృశ్యాలు
ఢిల్లీ, ముంబయిలో పరిస్థితులు మరీ దారుణం
ఎన్ని ఆసుపత్రులు తిరిగినా చేర్చుకోని వైనం
నిస్సహాయులుగా మారుతున్న బాధితులు
కరోనా మహమ్మారి అనేక హృదయవిదారక దృశ్యాలను కళ్లకు కడుతోంది. ఆసుపత్రుల్లో సరైన వసతులు లేక కొవిడ్ బాధితులు వారి కుటుంబ సభ్యులు పడుతున్న కష్టం వర్ణించలేనిది. ఢిల్లీ, ముంబయిలో పరిస్థితి రోజురోజుకీ మరింత దారుణంగా తయారవుతోంది. ఇప్పటికే వైద్య సదుపాయాల కొరత ఉండగా.. రోజురోజుకీ వచ్చి చేరుతున్న కరోనా రోగుల సంఖ్య మరింత పెరుగుతోంది.
ఢిల్లీలో గురువారం లోక్‌నాయక్ జయప్రకాశ్ (ఎల్‌ఎన్‌జేపీ) ఆస్పత్రి వద్ద జరిగిన ఓ ఘటన మనసును బరువెక్కిస్తోంది. అస్లాంఖాన్ అనే వ్యక్తి భార్య రుబీఖాన్‌కు కరోనా సోకింది. వెంటనే ఆమెను బైక్‌పై ఆస్పత్రికి తీసుకొచ్చారు. మొత్తం మూడు ఆస్పత్రులకు తీసుకెళ్లినా ఎవరూ చేర్చుకోవడానికి ముందుకు రాలేదు. చివరగా ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. ఈ క్రమంలో అప్పటికే తీవ్రంగా అలసిపోయిన అస్లాం తన నిస్సహాయతతో ఆస్పత్రి వర్గాలకు చేసిన విజ్ఞాపన అక్కడున్న వారందరినీ కలచివేసింది. ‘‘నా భార్య చచ్చిపోతోంది.. దయచేసి ఆమెను ఆస్పత్రిలో చేర్చుకోండి’’ అంటూ అస్లాం సిబ్బందిని వేడుకున్నారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఆస్పత్రుల్లో ఆక్సిజన్, వ్యాక్సిన్లు, పడకల కొరత తీవ్రంగా ఉంది. వీటి కోసం ప్రభుత్వం నుంచి ఎన్ని హామీలు వస్తున్నా.. రోజురోజుకీ ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయి. ఆస్పత్రిలో పడకలన్నీ నిండిపోయాయని సిబ్బంది చెబుతుండడంతో.. కుటుంబ సభ్యులు, వారి బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనేక హృదయవిదారక ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.