Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

గద్దర్ ను దూషించడం సబబు కాదు.

(రచయత ప్రముఖ కళాకారుడు సీనియర్ జర్నలిస్ట్ మల్లం రమేష్ )

గద్దర్ ను దూషించడం సబబు కాదు. గద్దర్ వయసు 72 సంవత్సరాలు. ఈయన వయసు కూడా చూడకుండా వాడు, వీడు అని సంబోధించడం, దూషించడం తేలికై పోయింది. ఈయన్ను దూషించిన వారిలో ఈయనకు మనవడి వయసు వారు, కొడుకు వయసు వారు ఉన్నారు. ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి దుషించాలా. గద్దర్ తన ఉద్యమంలో, తన గేయంలో సాహిత్య పరంగా, వాడుక భాష పరంగా, లయ బద్దంగా ఉండటం కోసం మినహా దూషించిన దాఖలాలు లేవు. ఈయన్ను విమర్శించాలని అనుకుంటే గౌరవ ప్రదంగా కూడా విమర్శించవచ్చు. అయినా గద్దర్ చేసిన తప్పు ఏంటి. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకొని, అభిషేకం చేయించుకొని వచ్చాడు. అదేమైనా నేరమా. ఆయనకు ఆ స్వేచ్చ లేదా. చాటు మాటుగా గుళ్ళకు, ప్రార్థనా మందిరాలకు వెళ్ళి వచ్చేవారు కొందరైతే, ఇండ్లల్లో పూజలు చేసుకొని బయట ఏమీ తెలియనట్లు ఉన్నవారు మరి కొందరు ఉన్నారు. వారితో పోల్చుకుంటే గద్దర్ నయమే కదా. బహిరంగంగా ఆలయానికి వెళ్లి వచ్చాడు. దాంతో కొందరు సామాజిక మాధ్యమాలలో దూషణకు దిగారు. చదువుకున్న వారే దుర్భాష తో కూడిన పదాలు వాడారు. ఎవరికి ఇష్టం వచ్చిన దేవున్ని వారు పూజించు కోవచ్చు. గద్దర్ గతంలో బతుకమ్మ,బోనాలు కూడా ఎత్తుకున్నారు. భద్రాచలం ఆలయానికి వెళ్లారు. వేములవాడ లో కోడె దూడ బహూకరించారు. సమ్మక్క,సారక్క ను పూజించారు. ఇవన్నీ ఆయన వ్యక్తి గతాలు. ఆయన ప్రజా జీవితంలో ప్రవేశించి పాతికేళ్ళు కావొస్తోంది. ఆయన బయటకు వచ్చాక నయీం మాదిరిగా హత్యలు, దౌర్జన్యాలు, కిడ్నాప్ లకు, సెటిల్మెంట్లకు పాల్పడ్డారా. ఉద్యమం లోనుంచి బయటకు వచ్చిన వారిలో కొందరు వివిధ పార్టీలలో చేరి చట్ట సభలకు వెళ్లారు. వాళ్లపై లేని దూషణలు గద్దర్ పై అవసరమా. ఆయన గుడికి వెళ్తే ఏంటి, వెళ్లక పోతే ఏంటి. అది మనకు సంబంధించిన విషయం కాదు. ఆయన వ్యక్తిగతం. మనం ఆయన్ను ప్రశ్నించే ముందు మన గురించి కూడా ప్రశ్నించుకోవాలి. డబ్బులు ఇస్తే ఓట్లు వేసేవాళ్లు మనలో చాలా మంది ఉన్నారు. చదువుకున్న వారు కూడా డబ్బు తీసుకొని ఓట్లు వేశారు. అవినీతి నేతలకు డబ్బా కొట్టే వాళ్ళూ మనలోనే ఉన్నారు. ఓట్ల కోసం బహిరంగంగా మరియు చాటుమాటుగా కుల మతాలను వాడుకునే వారిని మనం నెత్తిన ఎక్కించుకుంటున్నాము. గద్దర్ ఆలయానికి వెళితే మాత్రం అంతర్జాతీయ సమస్యలా చూస్తున్నాము. అదీ పరుష పదజాలంతో దూషించడం. నాకు తెలిసి గద్దర్ పై ఉద్యమానికి సంబంధించిన కేసులు తప్ప వ్యక్తి గతంగా ఆయన దాడులు, దౌర్జన్యాలు చేసిన కేసులు లేవు. దాఖలాలు లేవు. మనం కొన్నిటిని వ్యతిరేకించడం, కొన్నిటికి అనుకూలంగా ఉండటం మానుకోవాలి. ఎదుటి వారి వ్యక్తిగత స్వేచ్చ మనకు అనుకూలంగా ఉండాలని కోరుకోవడం తగదు. ముగింపు లో ఒక విషయం. ఆయన కొడుకు కాంగ్రెస్ లో చేరాడు. పోటీ చేసి ఓడి పోయాడు. దాని వల్ల మనకు లాభనష్టాలు ఏమున్నాయి. కాంగ్రెస్ లో చేరడం పెద్ద నేరమైనట్లు. అది వారి ఇష్టం. గద్దర్ కొడుకు ఎవరినైనా బెదిరించాడా. దోపిడి చేశాడా. అనేక మంది ఎర్ర పార్టీల నేతల కొడుకులు వివిధ పార్టీలలో చేరారు. పదవులు అనుభవిస్తున్నారు. అందరినీ కలిపి విమర్శించండి. గద్దర్ కొడుకును మాత్రమే విమర్శించడం ఎందుకు. వయసు పెరిగే కొద్దీ కొన్ని మార్పులు వస్తుంటాయి. ఆయన పాటను మనం ఇష్ట పడ్డాము. ఇష్ట పడ్డామే గానీ ఆయనకు మనం ఏమైనా చేశామా. మనకు ఎవ్వరిపై హక్కులు లేవు. గద్దర్ పై కూడా హక్కులు లేవు. అనేకమందికి అభిమానం మాత్రం ఉంది. పెద్ద వారికి మనం ఏమి ఇవ్వలేక పోయినా పర్వాలేదు గానీ గౌరవించడం మాత్రం మానకండి. దూషించకండి ధన్యవాదాలు.

Related posts

ధరల పెరుగుదల వార్తల నేపథ్యంలో.. భారీగా పెరిగిన ఈవీ-టూ వీలర్ల అమ్మకాలు…

Drukpadam

అమ్మాయిలు దొరకడం లేదని ఆవేదన.. పెళ్లి కాని ప్రసాదుల వినూత్న నిరసన!

Drukpadam

మరో వివాదంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు… తనను అవమానించారన్న మహిళా ఎంపీపీ…

Drukpadam

Leave a Comment