కేటీఆర్ లండన్ టూర్‌పై టీపీసీసీ సంచలన ఆరోపణ!
- ప్రస్తుతం లండన్ టూర్‌లో కేటీఆర్
- కేటీఆర్ ఆస్తులు కొంటున్నారంటూ టీపీసీసీ ఆరోపణ
- రాష్ట్రంలో దోచుకున్న డబ్బుతో అక్కడ ఆస్తులు కొంటున్నారన్న టీపీసీసీ
తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రస్తుతం లండన్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం లండన్‌లో జరిగిన ఓ రౌండ్ టేబుల్ సమావేశానికి నేతృత్వం వహించిన ఆయన… పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ ఎంత అనుకూలమన్న విషయాన్ని పలు దిగ్గజ సంస్థల ప్రతినిధులకు వెల్లడించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టే దిశగా కేటీఆర్ సాగిస్తున్న ఈ టూర్‌పై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ (టీపీసీసీ) సంచలన ఆరోపణలు చేసింది.
మూడు రోజులుగా లండన్‌లో తిరుగుతున్న కేటీఆర్… రాష్ట్రంలో దోచుకున్న డబ్బుతో అక్కడ వందల కోట్ల విలువ చేసే ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారని సమాచారం అందుతోందంటూ టీపీసీసీ ట్విట్టర్ వేదికగా ఓ కీలక ఆరోపణ చేసింది. లండన్ టూర్‌కు కేటీఆర్ సపరివార సమేతంగా వెళ్లారని కూడా ఆ పార్టీ ఆరోపించింది. అదే సమయంలో సొంత డబ్బులు ఖర్చు చేసి కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో పనులు చేసిన సర్పంచ్‌లు బిల్లులు రాకపోవడంతో మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమయ్యారని తెలిపింది.