సరైన సమయం చూసి దెబ్బకొడతాం: మావోయిస్టులకు అమిత్ షా హెచ్చరిక
- ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో 22 మంది జవాన్లు మృతి
- మరో 30 మందికి తీవ్ర గాయాలు
- గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు
- మావోయిస్టులకు దీటైన సమాధానం చెబుతామని షా హెచ్చరిక
- జవాన్ల త్యాగాలను వృథా కానివ్వబోమని హామీ
నేడు అసోంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి అమిత్ షా.. మధ్యలోనే తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన జవాన్ల సంఖ్య పెరగడంతో ఆయన హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అక్కడ ఉన్నత స్థాయి అధికారులతో భేటీ అయి తాజా పరిస్థితుల్ని అడిగి తెలుసుకుంటున్నారు.
ఢిల్లీకి బయలుదేరే ముందు అసోంలో మీడియాతో మాట్లాడిన అమిత్ షా.. ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాల గాలింపు ఇంకా కొనసాగుతోందని తెలిపారు. ఇరు వైపుల ప్రాణనష్టం సంభవించిందని పేర్కొన్నారు. అయితే, సంఖ్యను మాత్రం వెంటనే నిర్ధారించలేమని తెలిపారు.
ఈ సందర్భంగా మావోయిస్టులకు అమిత్ షా తీవ్ర హెచ్చరికలు చేశారు. ‘‘మా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ రక్తపాతాన్ని మేం సహించబోం. సరైన సమయం చూసి దీటైన సమాధానం చెబుతాం. జవాన్ల త్యాగాలను వృథా కానివ్వమని వారి కుటుంబ సభ్యులతో పాటు దేశ ప్రజలకు హామీ ఇస్తున్నా. నక్సలైట్లకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తున్న పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తాం’’ అంటూ మావోయిస్టులకు షా హెచ్చరిక చేశారు.
ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. ఎన్‌కౌంటర్‌లో మొత్తం 22 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇంకా కొంత మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. వారికోసం ముమ్మర గాలింపు కొనసాగుతోంది.