ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరుతో రూ. 6.50 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు
- కామారెడ్డిలో ఘటన
- తాము పెట్టే చానల్‌కు కవిత చైర్ పర్సన్ అని నమ్మబలికిన వైనం
- డైరెక్టర్‌గా నియమిస్తామంటూ రూ. 2 లక్షలు..
- డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పిస్తామని రూ. 4 లక్షలు వసూలు
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు చెప్పి ఓ వ్యక్తి నుంచి ఆరున్నర లక్షల రూపాయలు కొట్టేశారు ఇద్దరు కేటుగాళ్లు. కామారెడ్డిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం పట్టణానికి చెందిన మహేశ్, వినోద్‌లు తాము యూట్యూబ్ చానల్ విలేకరులమని చెప్పుకునేవారు. ఇటీవల వీరు మహమ్మద్ అనే వ్యక్తిని కలిసి తాము కొత్తగా న్యూస్ చానల్ ప్రారంభిస్తున్నామని, దీనికి ఎమ్మెల్సీ కవిత చైర్ పర్సన్‌గా వ్యవహరిస్తున్నట్టు నమ్మబలికారు.
చానల్‌కు డైరెక్టర్‌గా తీసుకుంటామంటూ అతడి నుంచి రూ. 2 లక్షలు వసూలు చేశారు. ఆ తర్వాత డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పిస్తామని మరో రూ. 4 లక్షలు వసూలు చేశారు. మరోసారి మహమ్మద్‌ను కలిసి చానల్ ప్రారంభించడంలో కొంత ఆలస్యం జరుగుతోందని, కాబట్టి మరో చానల్‌లో ఫొటోగ్రాఫర్‌గా చేరుస్తామని నమ్మించారు. ఐడీకార్డు కోసం రూ. 50 వేలు వసూలు చేశారు. అయినప్పటికీ ఐడీ కార్డు రాకపోవడంతో మోసపోయినట్లు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.