Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

‘అగ్ని పథ్’ ను రద్దు చేయాలి : సిపిఐ (ఎం) పొలిట్ బ్యూరో డిమాండ్!

‘అగ్ని పథ్’ ను రద్దు చేయాలి :
సిపిఐ (ఎం) పొలిట్ బ్యూరో డిమాండ్

న్యూఢిల్లీ :

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ‘అగ్నిపధ్’ పథకాన్ని సిపిఐ(ఎం) తీవ్రంగా వ్యతిరేకించింది. దీనివల్ల దేశ జాతీయ ప్రయోజనాలు దెబ్బతింటాయని పేర్కొంది. ఆ పార్టీ పొలిట్‌బ్యూరో గురువారం నాడిక్కడ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల జేసింది. నాలుగేళ్ల కాలానికి కాంట్రాక్టు పద్ధతిలో సైనికులను రిక్రూట్‌ చేయడం వల్ల వృత్తి నైపుణ్యాలతో కూడిన సాయుధ బలగాల సామర్ధ్యాన్ని పెంచడం సాధ్యం కాదని పేర్కొంది. పెన్షన్‌ డబ్బును ఆదా చేసుకోవడం కోసం ఈ పథకం తేవడమంటే మన వృత్తిపరమైన సాయుధ దళాల నైపుణ్యం, సామర్ధ్యంపై తీవ్రంగా రాజీపడడమేనని పొలిట్‌బ్యూరో పేర్కొంది.

గత రెండేళ్లుగా భారత సైన్యంలో ఎలాంటి రిక్రూట్‌మెంట్‌ లేదు. సాయుధ బలగాల్లోకి రెగ్యులర్‌ సైనికులను రిక్రూట్‌ చేసుకోవడానికి బదులు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. దీనివల్ల కాంట్రాక్టు సైనికులు తమ నాలుగేళ్ల సర్వీస్‌ తర్వాత ఎలాంటి ఉపాధి అవకాశాలు లేకుండా మిగిలిపోతారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితులకు తావిస్తుంది. వారు ప్రైవేట్‌ మిలీషియాగా పనిచేసే పరిస్థితివైపు నెట్టబడతారు. ఇప్పటికే తీవ్రమైన ఒడుదుడుకులకు గురవుతున్న మన సామాజిక వ్యవస్థపై దీని పర్యవసానాలు మరింత ప్రమాదకరంగా ఉంటాయి.

ఉపాధి భద్రతకు కనీస రక్షణ కూడా లేకుండానే అత్యున్నత త్యాగాలు చేయడానికి సిద్ధపడాలంటూ మన యువతకు పిలుపునివ్వడం నేరపూరితమైన చర్య అని పొలిట్‌బ్యూరో వ్యాఖ్యానించింది. ఈ పథకం గురించి ప్రభుత్వం ప్రకటించిన మరు క్షణమే దేశంలోని వివిధ ప్రాంతాల్లో అప్పటికప్పుడు పెద్దయెత్తున నిరసనలు, ఆందోళనలు చెలరేగాయంటే ఈ పథకం పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారో అర్థమవుతున్నది. ఈ రీత్యా అగ్నిపథ్‌ పథకాన్ని తక్షణమే రద్దు చేసి, సాయుధ బలగాల్లోకి రెగ్యులర్‌ రిక్రూట్‌మెంట్‌ వెంటనే చేపట్టాలని పొలిట్‌బ్యూరో డిమాండ్‌ చేసింది.

Related posts

నిజంగానే అంత పలుకుబడి నాకుంటే నేనెందుకు ఓడిపోతానయ్యా!: చంద్రబాబు!

Drukpadam

త్రిపుర సీఎం బిప్ల‌వ్ దేవ్ రాజీనామా!

Drukpadam

విచ్ఛిన్నకర శక్తుల ప్రయత్నాలను తిప్పికొట్టాలి..కేసీఆర్

Drukpadam

Leave a Comment