Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జాతుల ఘర్షణతో అట్టుడికిన ఇథియోపియా.. 230 మంది బలి!

జాతుల ఘర్షణతో అట్టుడికిన ఇథియోపియా.. 230 మంది బలి!
-ఒరోమియా ప్రాంతంలో ఘర్షణలు
-230 మంది మరణించారంటున్న ప్రత్యక్ష సాక్షి
-ఊచకోతకు రెబల్ గ్రూపే కారణమంటున్న బాధితులు
-తమకు సంబంధం లేదన్న రెబల్ గ్రూప్

జాతుల ఘర్షణలతో తూర్పు ఆఫ్రికాలోని ఇథియోపియా అట్టుడికింది. ఈ ఘర్షణల్లో అమ్హారా తెగకు చెందిన 200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఒరోమియా ప్రాంతంలో జరిగిన ఈ ఘర్షణల్లో 230 మంది మరణించినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. జాతుల ఘర్షణలో ఇటీవల జరిగిన అత్యంత దారుణమైన ఘటన ఇదేనని అధికారులు చెబుతున్నారు. రెబల్ గ్రూపే ఊచకోతకు పాల్పడిందని ఆరోపణలు వినిపిస్తుండగా, ఆ గ్రూపు మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది.

‘‘నేను 230 మృతదేహాలను లెక్కించాను. చాలా భయపడ్డాను. ఇంతటి మారణహోమాన్ని చూడడం ఇదే తొలిసారి. మా జీవితంలో పౌరులపై జరిగిన అత్యంత ఘోరమైన దాడి ఇదే’’ అని గింబీ కౌంటీకి చెందిన అబ్దుల్-సీద్ తాహిర్ పేర్కొన్నారు. మరణించిన వారిని సామూహికంగా ఖననం చేసినట్టు చెప్పారు. మృతదేహాలను తాము ఇంకా స్వాధీనం చేసుకుంటూనే ఉన్నామని, ఫెడరల్ ఆర్మీ బలగాలు ఇప్పుడే ఇక్కడకు చేరుకున్నాయని తాహిర్ పేర్కొన్నారు. బలగాలు వెళ్లిపోయిన తర్వాత మళ్లీ వారు విరుచుకుపడతారేమోనని భయంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

మరో ప్రత్యక్ష సాక్షి షాంబెల్ మాట్లాడుతూ.. మరోమారు సామూహిక హననం జరగకముందే తమను మరో ప్రాంతానికి సురక్షితంగా తరలించాలని ఆర్మీని వేడుకున్నారు. పునరావాస కార్యక్రమంలో భాగంగా 30 ఏళ్ల క్రితమే ఇక్కడ స్థిరపడ్డామని కానీ, ఇప్పుడు కోళ్లను కోసినట్టు కోసి చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒరోమో లిబరేషన్ ఆర్మీ (ఓఎల్ఏ) నే ఈ దాడులకు పాల్పడిందని ప్రత్యక్ష సాక్షులు ఇద్దరూ ఆరోపించారు. ఒరోమో ప్రాంతీయ ప్రభుత్వం కూడా ఓఎల్ఏనే కారణమని ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణల్లో ఎంతమాత్రమూ నిజం లేదని ఓఎల్ఏ అధికార ప్రతినిధి ఒడ్డా తర్బీ పేర్కొన్నారు. ‘‘మీరు చెబుతున్న ఆ దాడికి పాల్పడింది రీజనల్ మిలటరీ, స్థానిక మిలీషియానే’’ అని ఆరోపించారు.

Related posts

రేపటినుంచి లింగమంతుల జాతర … సూర్యాపేట వద్ద ట్రాఫిక్ ఆంక్షలు …

Drukpadam

అక్రిడేషన్ కు 30 నుంచి నలభై వేలా…? పక్కదార్లు పడుతున్న ప్రభుత్వ నిబంధనలు!

Drukpadam

ఇప్పుడు ఫరూక్ అబ్దుల్లా వంతు …రేపే విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు …

Drukpadam

Leave a Comment