టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు!
-2014లో అశ్వారావుపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా గెలిచిన తాటి
-ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరిన వైనం
-టీఆర్ఎస్‌లో తనకు ప్రాధాన్యం దక్కడం లేదని ఇటీవల ఆరోపణ
-తాజాగా గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే
-ఖమ్మం జిల్లా నేతలు ఎవరు లేకుండానే వెళ్లి కాంగ్రెస్ లో చేరిన తాటి
-సీతక్క వెంట వెళ్లి ఉంటాడని ప్రచారం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అశ్వారావు పేట నియోజకవర్గానికి చెందిన టీఆర్ యస్ మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అనుకున్నట్లుగానే కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు . టీఆర్ యస్ కు గుడ్ బై చెబుతానని అన్నంత పనీ చేసేశారు నిన్నటివరకు టీఆర్ యస్ లో ఉన్న తాటి పార్టీ తనకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడంలేదని నాలుగురోజుల కిందట మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పారు . ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు పై విమర్శలు గుప్పించారు . ఆయన ఊర్లోనే మెజారిటీ ఓట్లు వేయించలేక పోయారని ధ్వజమెత్తారు . ఆయన చేతగాని నాయకుడిగా ఉన్నారని అందువల్ల పార్టీ అశ్వారావు పేటలో గెలవలేకపోయిందని ఆరోపణలు చేశారు . తనకు పార్టీలో ప్రాధాన్యత దక్కకపోతే పార్టీని వీడతానని అల్టిమేటం జారీచేశారు . పార్టీ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో టీఆర్ యస్ గుడ్ బై చెప్పారు . వెంటనే కాంగ్రెస్ లో చేరిపోయారు . అయితే అక్కడివారు మాత్రం దటీస్ తాటి అంటున్నారు . ఎప్పుడైనా తాటి సడన్ గానే నిర్ణయాలు తీసుకుంటారని అంటున్నారు .
అంతకుముందు భూర్గంపాడు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు . 2014 ఎన్నికలకు ముందు వైసీపీ లో చేరారు . 2014 ఎన్నికల్లో అశ్వారావుపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన వెంకటేశ్వర్లు… ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. అయితే 2018 ఎన్నికల్లోనూ ఆయన అదే స్థానం నుంచి పోటీ చేసినా… పార్టీ నేతలు సహకరించని కారణంగానే తాను ఓటమిపాలయ్యానని ఇటీవలే ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా పార్టీలో తనలాంటి సీనియర్లకు ప్రాధాన్యం ఇవ్వకుంటే పార్టీ వీడతానని కూడా ఆయన పార్టీ అధిష్ఠానానికి తేల్చిచెప్పారు.
తాజాగా శుక్రవారం ఆయన నేరుగా గాంధీ భవన్‌కు వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వయంగా ఆయనకు కండువా వేసి మరీ పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర బాగు కోసం ముందుకు వచ్చే వారితో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రకటించారు.