చిప్ వేలికో, మోకాలికో, అరికాలికో ఉంటే సరిపోదు… బుర్రలో ఉండాలి: చంద్రబాబుపై సీఎం జగన్ సెటైర్!
- చంద్రబాబు వేలికి ప్లాటినం ఉంగరం
- ప్రత్యేక చిప్ తో కూడిన ఉంగరం
- ప్లీనరీలో సీఎం జగన్ స్పందన
- చిప్ బుర్రలో ఉంటే మంచి ఆలోచనలు వస్తాయని వ్యాఖ్యలు
ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు తన వేలికున్న ప్లాటినం ఉంగరం గురించి వివరించడం తెలిసిందే. దానిపై సీఎం జగన్ సెటైర్ వేశారు. వైసీపీ ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ, చిప్ వేలికో, మోకాలికో, అరికాలికో ఉంటే సరిపోదని, బుర్రలో ఉండాలని అన్నారు. అప్పుడే మంచి ఆలోచనలు వస్తాయని, ప్రజలకు మంచి చేయాలన్న బుద్ధి కలుగుతుందని వ్యాఖ్యానించారు. కానీ, చంద్రబాబుకు ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన ఎప్పుడూ లేదని విమర్శించారు.
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వలంటీర్ల వ్యవస్థ, గ్రామ/వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశామని సీఎం జగన్ వెల్లడించారు. స్థానిక పరిపాలనలో విప్లవాత్మక మార్పులకు అది నాంది అని పేర్కొన్నారు. చంద్రబాబు ఏనాడైనా ఇలాంటి ఆలోచన చేశారా? అని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా టీడీపీపై విమర్శలు గుప్పించారు. టీడీపీ ఒక పెత్తందారీ పార్టీ అని పేర్కొన్నారు. పేదల పట్ల సానుకూల దృక్పథం ఆ పార్టీ భావజాలంలో ఎక్కడా కనిపించదని అన్నారు. చంద్రబాబు సిద్ధాంతం వెన్నుపోటు అని, అప్పుడు ఎన్టీఆర్ కు, ఆ తర్వాత ఓట్లేసిన ప్రజలకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.
- వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా సీఎం జగన్
- ప్లీనరీలో కీలక తీర్మానం
- కృతజ్ఞతలు తెలిపిన సీఎం జగన్
- పథకాలు అందితేనే ఓటేయాలని వెల్లడి
లంచాలు, వివక్షకు తావులేని రీతిలో పార్టీలకు అతీతంగా ప్రజలకు లబ్ది చేకూర్చుతున్నామని, లబ్దిదారులకు ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేస్తున్నామని చెప్పారు.
గజదొంగల ముఠాకు, మంచి పాలనకు తేడా గమనించాలని సీఎం జగన్ పేర్కొన్నారు. అమరావతిలో 54 వేల ఇళ్లు పేదలకు ఇస్తే అడ్డుకుంటున్నారని విపక్ష నేతలపై మండిపడ్డారు. సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని కేసులు వేస్తున్నారని ఆరోపించారు. బినామీ భూముల ధరల కోసం దుష్టచతుష్టయం అడ్డుపడుతోందని మండిపడ్డారు. ఒక జిల్లాకు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరుపెడితే ఇళ్లు తగలబెట్టించారని విమర్శించారు.
కాగా, ఎన్నికల్లో ఫ్యాను గిర్రున తిరిగితే, సైకిల్ చక్రాలు ఊడిపోయాయని సీఎం జగన్ వ్యంగ్యం ప్రదర్శించారు. చక్రాలు లేని సైకిల్ ను బాబు తొక్కలేకపోయారని ఎద్దేవా చేశారు. తన కుమారుడితోనూ సైకిల్ తొక్కించలేకపోయారని వ్యాఖ్యానించారు. చివరికి దత్తపుత్రుడిని అరువు తెచ్చుకున్నారని ఎత్తిపొడిచారు.
ఎన్ని కుయుక్తులు పన్నినా దేవుడి దయతో మంచే గెలుస్తుందని సీఎం జగన్ నమ్మకం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూ… మేనిఫెస్టో అమలు చేశారని నమ్మితేనే జగనన్నకు తోడుగా ఉండండి అని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు అందితేనే వచ్చే ఎన్నికల్లో ఆశీర్వదించండి అని ఉద్ఘాటించారు.