చంద్రబాబుకు క్రెడిబిలిటీ లేదు.. పవన్ కల్యాణ్ కు క్యారెక్టర్ లేదు: కాకాణి గోవర్ధన్ రెడ్డి
- చంద్రబాబు, పవన్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్న కాకాణి
- వీరి వ్యాఖ్యలకు ఎల్లో మీడియా చాలా ప్రచారం చేస్తోందని విమర్శ
- రాష్ట్రంలో క్రాప్ హాలిడే ఎక్కడా లేదని వివరణ
రైతులకు పరిహారం ఇవ్వడం లేదంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. వీరు చేసే తప్పుడు వ్యాఖ్యలకు ఎల్లో మీడియా ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఆ ఆరోపణలను చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిరూపించగలరా? అని సవాల్ విసిరారు.
చంద్రబాబుకు క్రెడిబిలిటీ లేదని, పవన్ కల్యాణ్ కు క్యారెక్టర్ లేదని అన్నారు. వీరు చేస్తున్న వ్యాఖ్యలను పట్టుకుని ఎల్లో మీడియా తప్పుడు కథనాలను రాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతల అప్పుల సాగు అని కథనాలు రాస్తున్నారని.. వాస్తవంగా ఇది ఎల్లో మీడియా అబద్ధాల సాగు అని మండిపడ్డారు.
చంద్రబాబు హయాంలో రైతుల ఆత్మహత్యలను కూడా గుర్తించకుండా వాళ్లకి అన్యాయం చేశారని కాకాణి అన్నారు. సుమారు 471 మంది రైతులకు చంద్రబాబు హయాంలో పరిహారం ఇవ్వకపోతే… వైసీపీ ప్రభుత్వం పరిహారం ఇచ్చి అండగా నిలబడిందని చెప్పారు. రాష్ట్రంలో క్రాప్ హాలిడే ఎక్కడా లేదని అన్నారు.
వైసీపీ ప్లీనరీ తర్వాత దుష్టచతుష్టయానికి కడుపు మంట పెరిగిందని కాకాణి అన్నారు. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని పవన్ కల్యాణ్ కు ఎల్లో మీడియా చాలా ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. ఎల్లో మీడియా ఎలా పని చేస్తోందో చెప్పడానికి వారు రాస్తున్న తప్పుడు వార్తలే నిదర్శనమని అన్నారు.