మన్యం సుందరయ్య గా పేరున్న కుంజా బుజ్జి ఇకలేరు
అనారోగ్యంతో కన్నుమూసిన భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి
ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన కుంజా బొజ్జి
శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ మృతి
నియోజకవర్గంలో విషాద ఛాయలు
నియోజకవర్గంలో సైకిల్ పై తిరిగిన బొజ్జి
పెన్షన్ కూడా ప్రజలకే అందజేసిన నిస్వార్థపరుడిగా గుర్తింపు
మన్యం సుందరయ్యగా పేరున్న భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి ఇకలేరనే వార్త భద్రాచలం నియోజకవర్గ వాసులకే కాకుండా మొత్తం పేదల్లో , ప్రత్యేకించి గిరిజనులలో విషాదాన్ని నింపింది . మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నా ఏ నాడు ఎమ్మెల్యే దర్పం ఆయన ప్రదర్శించలేదు.నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు .పెద్దగా చదువులేకపోయిన సమాజమనే విద్యాలయంలో ఆయన పి హెచ్ డి చేశారు. పేదల బతుకులను అధ్యనం చేశారు. నిరంతరం వారికోసం తపించారు. గిరిజనలు బతుకులు బాగుపడాలని కోరుకున్నారు. తనకు లభించిన ఎమ్మెల్యే పదవిని ఏ నాడు తన స్వంతం కోసం స్వార్ధం కోసం ఉపయోగించుకోలేదు. అత్యంత నిరాడంబరమైన నేతగా, ప్రజల కోసమే చివరివరకు పాటుపడిన చిత్తశుద్ధి ఉన్న ప్రజాసేవకుడిగా గుర్తింపు పొందిన కుంజా బొజ్జి జీవితం నేటి తరానికి ఆదర్శం . పేదల మనిషిగా ఖ్యాతి గడించిన భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 95 సంవత్సరాలు. గత కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న కుంజా బొజ్జి భద్రాచలం లోని ఒక ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు.
ఇటీవలే ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు. పరిస్థితి విషమించడంతో భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. కుంజా బొజ్జి మృతితో నియోజకవర్గంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన భార్య లాలమ్మ మూడేళ్ల కిందట మరణించారు. ఆయనకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
ఆయన 1985లో మొదటిసారిగా సీపీఎం ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టారు. ఆపై 1989, 1994లోనూ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఓ ఎమ్మెల్యే అయినప్పటికీ బొజ్జి నిరాడంబరతకు మారుపేరుగా నిలిచారు. చివరి వరకు అదే జీవనపంథా అనుసరించారు. నియోజకవర్గంలో సైకిల్ పై తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకునేవారంటే ఆయన ఎలాంటి వ్యక్తో అర్థమవుతుంది. ఆఖరికి తన పెన్షన్ ను కూడా ప్రజల కోసమే ఖర్చుచేసిన నిస్వార్థపరుడు కుంజా బొజ్జి. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా సొంత ఇల్లు కూడా సమకూర్చుకోలేకపోయారు. ఆయన హైద్రాబాద్ లో ఉన్నా ఖమ్మం సమావేశాలకు వచ్చిన భద్రాచలం నియోజకవర్గానికి ,గిరిజనులకు కావాల్సిన వాటికోసమే అధికారులను ,మంత్రిలను కలిసేవారు . ఆయన బయట పర్యటనలకు వచ్చిన పెద్దగా హోటళ్లకు వెళ్లేందుకు ఇష్టపడే వారు కాదు . ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న బాక్స్ లేదా తన గన్ మెన్ ఇంటినుంచి తెచ్చిన భోజనం మాత్రమే చేసేవారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం
బొజ్జి మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ తన సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భద్రాచలం నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కుంజా బొజ్జి… గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని సీఎం కేసీఆర్ కొనియాడారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
బొజ్జి మృతి పట్ల సిపిఎం,సిపిఐ ,ఎం ఎల్ న్యూ డెమోక్రసీ తో పాటు వివిధ రాజకీయపార్టీల నేతలు సంతాపం తెలిపారు.
సత్తుపల్లి ఎమ్మెల్యే వెంకట వీరయ్య సంతాపం
*భద్రాచలం మాజీ శాసనసభ్యులు కుంజా. బొజ్జి మృతి పట్ల తీవ్ర సంతాపం తెలిపిన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సిపిఐ(ఎం) సీనియర్ నాయకులు కుంజా. బొజ్జి మృతి పట్ల సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య తీవ్ర సంతాపాన్ని తెలిపారు. భద్రాచలం నియోజకవర్గం నుండి 1985,1989,1994 లలో వరసగా మూడు సార్లు ఎమ్మెల్యే గా పనిచేసిన కుంజా. బొజ్జి మరణం ఆ ప్రాంత ప్రజలకు తీరనిలోటు అని అన్నారు. ఈ సందర్బంగా సిపిఎం పార్టీలో పనిచేసినప్పటి వారితో ఉన్న అనుబంధాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గుర్తుచేసుకున్నారు. నిరాడంబర జీవితాన్ని కొనసాగిస్తూ, నిరంతరం ప్రజల హక్కుల కోసమే పోరాడిన వ్యక్తి కుంజా. బొజ్జి అని అన్నారు.