వరంగల్ టీఆర్ యస్ లో కొనసాగుతున్న వార్ ….
-ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు: కడియం శ్రీహరి
-స్టేషన్ ఘన్ పూర్ లో రాజయ్య వర్సెస్ కడియం
-కడియం 360 మందిని ఎన్ కౌంటర్ చేయించాడన్న రాజయ్య
-ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలన్న కడియం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీఆర్ యస్ నేతల మధ్య వార్ కొనసాగుతుంది. స్టేషన్ ఘనపూర్ కు చెందిన ఎమ్మెల్యే రాజయ్య , మాజీ మంత్రి కడియం శ్రీహరి మధ్య మాటలు తూటాలై పేలుతున్నాయి . నియోజకవర్గంపై కన్నేసిన ఇద్దరు నేతలు ఒకేపార్టీ లో ఉండటంతో సీటుకోసం ఎత్తులు వేస్తున్నారు . అందులో భాగంగానే ఒక్కరిపై ఒకరు కారాలు ,మిరియాలు నూరుకుంటున్నారు . రాష్ట్రంలో అనేక జిల్లాల్లో టీఆర్ యస్ లో ఆధిపత్య పోరు ఉన్న వరంగల్ లో అది ఎక్కువగా కనిపిస్తుందని అభిప్రాయాలూ ఉన్నాయి. టీఆర్ యస్ లో వర్గ పోరుపై అటు కేసీఆర్ గాని ఇటు యువనేత కేటీఆర్ గాని పెదవి విప్పకపోవడం పార్టీకి చేటు తెచ్చేలా కనిపిస్తుందని అభిప్రాయాలూ ఉన్నాయి. పార్టీలో అంతర్గత సమస్యలు పరిష్కరించి గాడిలో పెట్టకపోతే ఇబ్బందులు తప్పవని టీఆర్ యస్ సీనియర్లు సైతం అంగీకరిస్తున్నారు .
టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై, ఆ పార్టీ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి నిప్పులు చెరిగారు. రాజకీయాల్లో చిల్లర పనులు పనికిరావని, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. తాను తెలంగాణకు తొలి డిప్యూటీ సీఎంనని చెప్పుకుంటాడని, కానీ దేశంలో బర్తరఫ్ అయిన తొలి డిప్యూటీ సీఎం కూడా రాజయ్యేనని కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు.
తప్పు చేస్తూ కూడా ఇంగితం లేకుండా మాట్లాడుతున్నాడని, రాజయ్యవి మతిస్థితిమితం లేని మాటలని విమర్శించారు. రాజయ్య అవినీతిపై ఆధారాలు ఉన్నాయని, అవన్నీ బయటపెడితే గ్రామాల్లో తిరగలేడని స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయాన్ని పాటిస్తూ తాను మౌనంగా ఉంటున్నానని కడియం శ్రీహరి వెల్లడించారు. స్టేషన్ ఘన్ పూర్ నీ అడ్డా కాదు అంటూ రాజయ్యపై మండిపడ్డారు. ఒకవేళ నీ అడ్డా అనుకుంటే ఓ స్వచ్ఛంద సంస్థతో సర్వే చేయిద్దామని, ప్రజలను రాజయ్యను కోరుకుంటున్నారో, కడియం శ్రీహరిని కోరుకుంటున్నారో తేలిపోతుందని సవాల్ విసిరారు. దమ్ముంటే తన సవాల్ కు స్పందించాలని, లేకపోతే ఇంకెప్పుడూ తన ప్రస్తావన తీసుకురావద్దని స్పష్టం చేశారు.
ఇటీవల రాజయ్య చేసిన వ్యాఖ్యలే కడియం ఆగ్రహానికి కారణం. కడియం శ్రీహరి తనంటే గిట్టనవాళ్లను 360 మందిని ఎన్ కౌంటర్ చేయించాడని, టీడీపీ హయాం నుంచి శ్రీహరి అమాయకులను పొట్టనబెట్టుకున్నాడని రాజయ్య చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.