విశాఖ నుంచి రెండో అదనపు సీబీఐ కోర్టు కర్నూలుకు తరలింపు!
- విశాఖ కేంద్రంగా ఏపీ పరిధిలోని సీబీఐ కేసుల విచారణ
- విజయవాడకు తరలనున్న మూడో అదనపు సీబీఐ కోర్టు
- విశాఖలోని ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జీకి హైకోర్టు ఆదేశాలు
విశాఖలోని సీబీఐ ప్రత్యేక కోర్టుల్లోని రెండు కోర్టులు ఏపీలోని ఇతర ప్రాంతాలకు తరలనున్నాయి. ఈ మేరకు ఏపీ హైకోర్టు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీకి సంబంధించి సీబీఐ కేసులన్నీ విశాఖలోని సీబీఐ కోర్టులోనే విచారణకు వస్తున్నాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందిన కేసులనూ విశాఖలోని సీబీఐ కోర్టే విచారిస్తోంది. ఈ క్రమంలో ఏపీ హైకోర్టు విశాఖలోని సీబీఐ కోర్టులను విజయవాడ, కర్నూలుకు తరలిస్తూ నిర్ణయం తీసుకుంది.
విశాఖలో ఒకటో అదనపు సీబీఐ కోర్టుతో పాటు రెండో అదనపు సీబీఐ కోర్టు, మూడో అదనపు సీబీఐ కోర్టులు కొనసాగుతున్నాయి. వీటిలో ఒకటో అదనపు కోర్టును విశాఖలోనే ఉంచుతూ రెండో అదనపు సీబీఐ కోర్టును కర్నూలుకు, మూడో అదనపు సీబీఐ కోర్టును విజయవాడకు తరలించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు అడ్మిన్ రిజిస్ట్రార్ విశాఖలోని ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జీకి ఆదేశాలు జారీ చేశారు.