తన కుమారుడికి విడాకులు ఇవ్వాలనుకున్న కోడలు.. వెతికి మరీ చంపేసిన ఇండియన్ అమెరికన్ మామ!
- 150 మైళ్లు ప్రయాణించి మరీ కోడలిని హత్య చేసిన నిందితుడు
- మామ తన కోసం వెతుక్కుంటూ వచ్చాడని మేనమామకు ఫోన్ చేసి చెప్పిన బాధితురాలు
- ఆమె మాట్లాడుతుండగానే కాల్పులు జరిపిన మామ
- నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
తన కుమారుడికి విడాకులు ఇవ్వాలనుకున్న పెద్ద కోడలిని వెతికి మరీ చంపేశాడో మామ. అమెరికాలోని కాలిఫోర్నియాలో వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వాల్‌మార్ట్‌లో పనిచేస్తున్న గురుప్రీత్ కౌర్ దోసాంజ్ శాంజోస్‌లో ఉంటున్నారు. మనస్పర్థల కారణంగా భర్తకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. తన కుమారుడికి విడాకులు ఇవ్వాలన్న ఆమె నిర్ణయం మామ సీతల్ సింగ్ దోసాంజ్ (74) కు నచ్చలేదు. దీంతో ఆమెను మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. ప్రెన్సో నుంచి 150 మైళ్లు ప్రయాణించి కోడలు పనిచేస్తున్న వాల్‌మార్ట్‌కు చేరుకుని కాల్చి చంపాడు.
సీతల్ సింగ్ కాల్పులు జరపడానికి ముందు గురుప్రీత్ తన మేనమామకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. లాట్‌లో సీతల్ డ్రైవింగ్ చేస్తుండగా చూశానని, తనను వెతుక్కుంటూ 150 మైళ్లు వచ్చాడని ఆమె తన మేనమామకు చెప్పారు. సీతల్ తన కోసం వెతుకుతున్నాడని, భయంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతుండగానే దూసుకొచ్చిన సీతల్ తుపాకితో కాల్పులు జరిపాడు. సీతల్ తన కారు వద్దకు సమీపిస్తున్న సమయంలో గురుప్రీత్ కేకలు వేయడం వినిపించిందని, ఆమె చివరి మాటలు అవేనని, ఆ తర్వాత ఫోన్ డిస్‌కనెక్ట్ అయిందని ఆమె మేనమామ పేర్కొన్నట్టు పోలీసులు తమ దర్యాప్తు నివేదికలో పేర్కొన్నారు.
కాగా, ఘటన జరిగిన ఐదు గంటల తర్వాత వాల్‌మార్ట్ ఉద్యోగి ఒకరు కారులో గురుప్రీత్ మృతదేహాన్ని గుర్తించారు. ఆమె శరీరంపై రెండు బుల్లెట్ గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. గురుప్రీత్ మేనమామ ఇచ్చిన సమాచారం ఆధారంగా సీతల్‌ను నిందితుడిగా గుర్తించారు. ఆ తర్వాతి రోజు ఆయనింటికి చేరుకుని అరెస్ట్ చేశారు. ఆ సందర్భంగా ఓ తుపాకిని స్వాధీనం చేసుకున్నారు.