Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బ్రిటన్ ప్రధాని హోదాలో రిషి సునాక్ తొలి ప్రసంగం…

బ్రిటన్ ప్రధాని హోదాలో రిషి సునాక్ తొలి ప్రసంగం…

  • బ్రిటన్ నూతన ప్రధానిగా రిషి సునాక్
  • నేడు కింగ్ చార్లెస్ తో భేటీ
  • అనంతరం నెం.10 డౌనింగ్ స్ట్రీట్ లో బాధ్యతల స్వీకరణ
  • ప్రజలనుద్దేశించి ప్రసంగం

బ్రిటన్ రాజు చార్లెస్ ను కలిసిన అనంతరం దేశ నూతన ప్రధానిగా రిషి సునాక్ బాధ్యతలు చేపట్టారు. సునాక్ నేడు బకింగ్ హామ్ ప్యాలెస్ లో కింగ్ చార్లెస్ తో భేటీ అనంతరం నెం.10 డౌనింగ్ స్ట్రీట్ లో ఉన్న ప్రధానమంత్రి కార్యాలయానికి విచ్చేశారు. ప్రధాని హోదాలో తొలి ప్రసంగం వెలువరించారు.

తన కంటే ముందు ప్రధానిగా వ్యవహరించిన లిజ్ ట్రస్ చేసిన తప్పిదాలను సరిదిద్దడం తనముందున్న బాధ్యత అని పేర్కొన్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న బ్రిటన్ ను ఈ గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు ప్రజలు కొన్ని కఠిన నిర్ణయాలను ఎదుర్కోక తప్పదని స్పష్టం చేశారు.

“ఆర్థిక సుస్థిరత, ఆర్థిక భరోసా అంశాలు మా ప్రభుత్వ అజెండాలో ప్రధానమైనవి. గతంలో తప్పులు జరిగాయి కాబట్టి, రాబోయే కాలంలో కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవు. నాకంటే ముందు ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన లిజ్ ట్రస్ కు నీరాజనాలు. ఆమె ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలని భావించడం తప్పేమీకాదు. అది ఒక పవిత్ర లక్ష్యం. ఈ దిశగా ఆమె సాగించిన అవిశ్రాంత కృషిని అభినందిస్తున్నాను. ఈ క్రమంలో ఆమె కొన్ని పొరపాట్లు చేసి ఉండొచ్చు. అయితే వాటి వెనుక చెడు ఉద్దేశాలు ఉన్నాయని చెప్పలేం. కానీ, ఆ తప్పిదాలను సరిదిద్దుతానన్న నమ్మకంతోనే ఇప్పుడు నన్ను పార్టీ అధ్యక్షుడిగా, ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారని భావిస్తున్నాను.

ఇక, బోరిస్ జాన్సన్ గురించి చెప్పాల్సి వస్తే, ప్రధానమంత్రిగా అనేక ఘనతరమైన కార్యక్రమాలు చేపట్టారు. ఆయన ఆప్యాయత, ఔదార్యాలను ఎంతో విలువైనవిగా భావిస్తాను. అయితే 2019లో కన్జర్వేటివ్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారంటే అది ఏ ఒక్క వ్యక్తి ఘనతగానో, ఏ ఒక్క వ్యక్తి సొంతం అనో భావించరాదు. అది అందరికీ సంబంధించిన, అందరినీ ఏకం చేసే విజయం. ఆ విజయానికి మన మానిఫెస్టోనే గుండెకాయ. ఆ మానిఫెస్టోను అమలు చేసేందుకు కృషి చేస్తాను.

దేశంలో నెలకొన్న పరిస్థితులు ఎంత కఠినమైనవో నాకు తెలుసు. ప్రజల నమ్మకం పొందడానికి ఎంతో శ్రమించాల్సి ఉందని నాకు అర్థమైంది. నేను చేపట్టిన పదవి ఎలాంటిదో నాకు తెలుసు… ఆ పదవికి అనుగుణంగానే పనిచేస్తాను. తదుపరి తరం ప్రజల భవిష్యత్తే మాకు పరమావధి. పిల్లలు, వాళ్ల పిల్లలు రుణగ్రస్తులుగా ఉండాల్సిన అవసరంలేని వ్యవస్థను తీర్చిదిద్దుతాం.

కేవలం మాటలతోనే దేశాన్ని ఏకం చేయాలని నేను భావించడంలేదు. మీకోసం రేయింబవళ్లు పనిచేస్తాను. ఈ ప్రభుత్వానికి అన్ని స్థాయుల్లో సమగ్రత, వృత్తి నిబద్ధత, జవాబుదారీతనం ఉన్నాయని నిరూపిస్తాం. మా పార్టీలో నన్ను నమ్మారు… ఇక నేను మీ (ప్రజలు) నమ్మకం పొందాల్సి ఉంది.

మానిఫెస్టో అమలును అత్యంత ప్రధాన అంశంగా భావిస్తాను. ముఖ్యంగా, అత్యంత పటిష్టమైన జాతీయ ఆరోగ్య వ్యవస్థ (ఎన్ హెచ్ఎస్) ను రూపొందిస్తాం. మెరుగైన విద్యా వ్యవస్థ, శాంతిభద్రతలు, సరిహద్దుల రక్షణ, పర్యావరణ పరిరక్షణ, సాయుధ దళాలకు మద్దతు, సంక్షేమం, బ్రెగ్జిట్ నేపథ్యంలో అవకాశాలను అందిపుచ్చుకుని బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించుకోవడం, పెట్టుబడులు, ఆవిష్కరణల రంగంలో ఉపాధి కల్పన కోసం పాటుపడతాను” అంటూ రిషి సునాక్ ప్రసంగించారు.

Related posts

మీ గురించి వాస్తవాలు చెపితే ఉరేసుకుని చస్తారు: చంద్రబాబుపై అంబటి విమర్శలు!

Drukpadam

తెలుగువాడ్ని అని చెప్పుకునే దమ్ము ధైర్యం ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్: బాలకృష్ణ

Drukpadam

టీఆర్ఎస్సా?, బీఆర్ఎస్సా?.. మునుగోడు బైపోల్‌లో గులాబీ అభ్య‌ర్థి పార్టీ పేరుపై డైల‌మా!

Drukpadam

Leave a Comment