చస్తే కూడా శ్మశానంలో చోటు దొరకట్లేదు.. ఇదేనా బంగారు తెలంగాణ?: రేవంత్ రెడ్డి
- కరోనా వేళ ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారు
- కరోనాను ఎదుర్కొని బతుకుదామంటే ఔషధాలు దొరకట్లే
- రెండేళ్లలో మా పార్టీ అధికారంలోకి వస్తుంది
- ఎవరి బెదిరింపులకు భయపడం

తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణలో వరంగల్, ఖమ్మం మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో వరంగల్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రేవంత్ పాల్గొని మాట్లాడారు. వరంగల్‌ను టీఆర్ఎస్ మురికి నగరంగా తయారు చేసిందని, అటువంటి పార్టీకి ఓటు వేయాలా? అని ప్రశ్నించారు. కరోనా విజృంభిస్తోన్న సమయంలోనూ ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలారని ఆయన విమర్శలు గుప్పించారు.
ప్రజలు కరోనాను ఎదుర్కొని బతుకుదామంటే ఔషధాలు దొరకట్లేవని, చివరకు చస్తే కూడా శ్మశానంలో చోటు దొరకట్లేదని ఆయన విమర్శలు గుప్పించారు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా? అని నిలదీశారు. రెండేళ్లలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాము ఎవరి బెదిరింపులకు భయపడేది లేదని ఆయన చెప్పారు.