ఆ ఐదు ఔషధాల తయారీని నిలిపివేయండి.. ‘పతంజలి’కి ఉత్తరాఖండ్ రాష్ట్ర ఆయుర్వేద, యునానీ నియంత్రణ మండలి ఆదేశాలు!
- మధుగ్రిట్, ఐగ్రిట్, థైరోగ్రిట్, బీపీ గ్రిట్, లిపిడామ్ తయారీపై నిషేధం
- తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వొద్దని హెచ్చరిక
- తమ అనుమతులతోనే ప్రకటనలు ఇవ్వాలని ఆంక్షలు
ప్రముఖ ఆయుర్వేద ఔషధ సంస్థ, బాబా రామ్ దేవ్ కు చెందిన పతంజలి దివ్య ఫార్మసీకి ఉత్తరాఖండ్ రాష్ట్ర ఆయుర్వేద, యునానీ నియంత్రణ మండలి షాక్ ఇచ్చింది. ఐదు ఔషధాల తయారీని నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. మధుగ్రిట్, ఐగ్రిట్, థైరోగ్రిట్, బీపీ గ్రిట్, లిపిడామ్ వీటిల్లో ఉన్నాయి. తమ అనుమతులు పొందిన తర్వాతే వీటి తయారీని తిరిగి ప్రారంభించాలని ఆదేశించింది.
మధుమేహం, గ్లకోమా (నీటి కాసులు), థైరాయిడ్, రక్తపోటు, కొలెస్ట్రాల్ అధిక రక్తపోటుకు ఈ ఔషధాలు చక్కని ఫలితమిస్తాయంటూ పతంజలి దివ్య ఫార్మసీ ప్రచారం చేసుకుంటోంది. తప్పుదోవ పట్టించే ఇటువంటి ప్రకటలను వెంటనే నిలిపివేయాలని ఉత్తరాఖండ్ రాష్ట్ర ఆయుర్వేద, యునానీ ఔషధ మండలి ఆదేశించింది. భవిష్యత్తులో ఉత్పత్తులకు సంబంధించి ప్రకటనలు తమ అనుమతి పొందిన తర్వాతే ఇవ్వాలని ఆంక్షలు విధించింది. ఉల్లంఘిస్తే ఔషధ తయారీ లైసెన్స్ ను వెనక్కి తీసుకుంటామని హెచ్చరించింది. ఔషధ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా దివ్య ఫార్మసీ ప్రకటనలు ఇస్తున్నట్టు ఆరోపించింది.