Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సినిమా వార్తలు

బుర్రిపాలెం బుల్లోడు ఇక లేరు …

దివికేగిన ధ్రువతార.. సూపర్ స్టార్ కృష్ణ అస్తమయం

  • కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • తీవ్ర దిగ్భ్రాంతికి గురైన అభిమానులు
  • విషాదంలో కుటుంబ సభ్యులు

ప్రముఖ సినీనటుడు సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్‌తో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఆయన ఈ తెల్లవారుజామున మృతి చెందారు. దీంతో కృష్ణ కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. విషయం తెలిసిన అభిమానులు, తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. కృష్ణ గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెంలో 31 మే 1942లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతుల ఐదుగురి సంతానంలో కృష్ణ పెద్దవారు.

కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి. కృష్ణ డిగ్రీ చదువుతున్నప్పుడు ఏలూరులో అక్కినేని నాగేశ్వరరావుకు ఘనంగా సన్మానం జరిగింది. అది చూసిన కృష్ణ సినిమాలపై మోజు పెంచుకున్నారు. దీంతో ఆయన సినీ రంగానికి వచ్చేశారు. 1965లో ఆయన ఇందిరను వివాహం చేసుకున్నారు. వీరికి రమేశ్ బాబు, మహేశ్‌బాబు, పద్మావతి, ప్రియదర్శిని, మంజుల సంతానం. ఆ తర్వాత విజయ నిర్మలను కృష్ణ రెండో వివాహం చేసుకున్నారు.

1964లో ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు రూపొందించిన ‘తేనె మనసులు’ సినిమాతో కృష్ణ సినీరంగంలోకి ప్రవేశించారు. అయితే, ఆ సినిమాలో కృష్ణ నటన ఏమంత బాగోలేదని, ఆయనను ఆ సినిమా నుంచి తొలగించాలన్న ఒత్తిడి వచ్చినా ఆదుర్తి సుబ్బారావు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. 1965లో విడుదలైన ‘తేనెమనసులు’ సూపర్ డూపర్ హిట్ సాధించింది.

కృష్ణ రెండో సినిమా ‘కన్నెమనసులు’. అనంతరం ‘గూఢచారి 116’లో అవకాశం లభించింది. అది కూడా బ్రహ్మాండమైన విజయం సాధించడంతో ఆయన ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ సినిమా తర్వాత కృష్ణను ఆయన అభిమానులు ఆంధ్రా జేమ్స్‌బాండ్‌గా పిలుచుకునేవారు. ప్రముఖ దర్శకుడు బాపు తెరకెక్కించిన ‘సాక్షి’ సినిమా ఆయన ఇమేజ్‌ను అమాంతం పెంచేసింది. విజయ నిర్మలతో నటించిన తొలి చిత్రం ఇదే.

 కృష్ణ మృతిపై రాజకీయ, సినీ ప్రముఖుల సంతాపం

 Celebrities mourn Krishnas death

టాలీవుడ్ జేమ్స్‌బాండ్, సూపర్ స్టార్ కృష్ణ మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.

కృష్ణ స్ఫూర్తి అజరామరం: వెంకయ్య నాయుడు
సూపర్ స్టార్ కృష్ణ మృతికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం తెలిపారు. తెలుగు తెరపై కృష్ణ నింపిన స్ఫూర్తి అజరామరమని కొనియాడారు. సినిమాల్లోని ఆయన పాత్రలు యువశక్తికి చిహ్నంగా ఉండేవన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సినీ పరిశ్రమకు కృష్ణ సేవలు అమోఘం: ఏపీ గవర్నర్
నటుడిగా, నిర్మాతగా, నిర్మాణ సంస్థ అధినేతగా తెలుగు సినీ రంగానికి కృష్ణ అందించిన సేవలు మరువలేనివని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. 350కిపైగా సినిమాల్లో నటించిన కృష్ణ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సామాజిక స్పృహ కలిగించారు: కేసీఆర్
కృష్ణ తన సినిమాలతో ప్రజలకు సామాజిక స్పృహ కల్పించారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సాంఘిక చిత్రాలతో జనాదరణ సంపాదించుకున్నారని పేర్కొన్నారు. అప్పట్లో కార్మిక, కర్షక లోకం ఆయనను తమ అభిమాన హీరోగా, సూపర్ స్టార్‌గా కీర్తించేవారని గుర్తు చేసుకున్నారు. సొంత నిర్మాణ సంస్థ స్థాపించి దాని ద్వారా సినీ పరిశ్రమలో నూతన ఒరవడులు ప్రవేశపెట్టిన ఘనత ఆయనదేనని అన్నారు. కృష్ణ కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మనసున్న మనిషి: జగన్

కృష్ణ మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆంధ్రా జేమ్స్‌బాండ్‌గా కృష్ణ కీర్తి గడించారని కొనియాడారు. నిజజీవితంలోనూ ఆయన మనసున్న మనిషని అన్నారు. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకే కాక, తెలుగు జాతికి కూడా తీరని లోటని అన్నారు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి భగవంతుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.

భారత సినీ పరిశ్రమలోనే అరుదైన వ్యక్తి: చిరంజీవి  
కృష్ణ మనల్ని విడిచిపెట్టి వెళ్లారంటే నమ్మశక్యం కాకుండా ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ధైర్యానికి ఆయన పర్యాయపదమని, సాహసానికి ఊపిరి అని కొనియాడారు. ధైర్యం, సాహసం, పట్టుదల, మానవత్వం, మంచితనం కలబోతే కృష్ణ అని అన్నారు. ఆయన మృతి మాటలకందని విషాదమని పేర్కొన్నారు. కృష్ణ లాంటి మహా మనీషి తెలుగు చిత్రపరిశ్రమలోనే కాదని, భారత సినీ పరిశ్రమలోనే అరుదని అన్నారు. తెలుగు సినీ పరిశ్రమ సగర్వంగా తలెత్తుకునేలా అనేక సాహసాలు చేసిన కృష్ణకు అశ్రునివాళి తెలియజేసుకుంటున్నట్టు ట్వీట్ చేశారు.

సాహసానికి మరో పేరు: జూనియర్ ఎన్టీఆర్
సాహసానికి మరో పేరే కృష్ణ అని టాలీవుడ్ ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ప్రయోగాత్మక చిత్రాలు, విలక్షణమైన పాత్రలే కాకుండా సాంకేతికంగానూ తెలుగు సినిమాకు ఎన్నో విధానాలను పరిచయం చేసిన ఘనత కృష్ణకే దక్కుతుందని అన్నారు.

చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు: రేవంత్‌రెడ్డి
హైదరాబాద్‌లో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృష్ణ ఎంతగానో కృషి చేశారని కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయన మృతికి సంతాపం తెలిపిన రేవంత్.. కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. కృష్ణ మరణం సినీ రంగానికి తీరని లోటని అన్నారు.

  • కృష్ణ మృతి తనను తీవ్రంగా కలచివేసిందన్న చంద్రబాబు
టాలీవుడ్ జేమ్స్ బాండ్‌గా, విలక్షణ నటుడిగా పేరున్న కృష్ణ మృతి సినీ రంగానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణగారి మరణంతో ఒక అద్భుత సినీశకం ముగిసిందన్నారు. ఇటీవలే తల్లిని, ఇప్పుడు తండ్రిని కోల్పోయిన మహేశ్ బాబుకు ఇది తీరని వేదన మిగిల్చిందన్నారు. ఈ బాధ నుంచి మహేశ్ బాబు త్వరగా కోలుకునే ధైర్యాన్ని భగవంతుడు ఆయనకు ప్రసాదించాలని కోరుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
  • కృష్ణతో 45 సినిమాల్లో నటించిన జయప్రద
సూపర్ స్టార్ కృష్ణ మృతితో టాలీవుడ్ మూగబోయింది. తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో మార్పులకు నాంది పలికిన ఆంధ్ర జేమ్స్ బాండ్ మృతితో సినీ పరిశ్రమ షాక్ కు గురయింది. మరోవైపు, తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో చిత్రాల్లో నటించిన కృష్ణ ఎందరో హీరోయిన్లకు లైఫ్ ఇచ్చారు. ముఖ్యంగా ఆయన సరసన ఎక్కువ సినిమాల్లో చేసిన ఘనత జయప్రదదే. కృష్ణతో కలిసి ఆమె ఏకంగా 45 చిత్రాల్లో నటించారు. ఒక హీరోతో ఓ హీరోయిన్ ఇన్ని చిత్రాల్లో నటించడం ఓ రికార్డు. ఆ ఘనత జయప్రదకే దక్కింది.

Related posts

ఏపీ సీఎం జగన్‌తో మెగాస్టార్ చిరంజీవి లంచ్ మీట్!

Drukpadam

నంది అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేసిన పోసాని!

Drukpadam

‘మా’ ఎన్నికల్లో చిరంజీవి మద్దతు ప్రకాష్ రాజ్ కే నన్న నాగబాబు…

Drukpadam

Leave a Comment