ఈడీ విచారణ సందర్భంగా ఎల్.రమణకు అస్వస్థత… ఆసుపత్రికి తరలింపు!
- కాసినో కేసులో ఎల్.రమణకు ఈడీ నోటీసులు
- నేడు విచారణకు హాజరైన ఎల్.రమణ
- రెండు గంటల పాటు విచారించిన ఈడీ అధికారులు
- అస్వస్థతకు గురికావడంతో యశోదా ఆసుపత్రిలో చికిత్స
క్యాసినో కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎల్.రమణ ఇవాళ ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. అయితే విచారణ సందర్భంగా ఆయన అస్వస్థతకు గురికావడంతో ఈడీ కార్యాలయంలో కలకలం రేగింది. ఆయనను వెంటనే సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది.
అంతకుముందు, ఎల్.రమణను ఈడీ అధికారులు రెండు గంటల పాటు ప్రశ్నించారు. తాను నేపాల్ బిగ్ డాడీ ఈవెంట్ కు వెళ్లలేదని ఎల్.రమణ అధికారులకు స్పష్టం చేసినట్టు సమాచారం.
ఎల్.రమణకు ఇటీవలే గుండె శస్త్రచికిత్స జరిగింది. ఈడీ విచారణలో ఆయన అస్వస్థతకు గురయ్యారన్న సమాచారంతో ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కాగా, విచారణ కోసం ఈడీ కార్యాలయానికి వచ్చిన ఆయన లిఫ్టు ద్వారా కాకుండా మెట్లు ఎక్కి మూడో అంతస్తుకు వెళ్లారు. విచారణ సమయంలో అక్కడి సిబ్బందిని మంచినీళ్లు అడిగారు. ఆపై కాసేపటికే అస్వస్థతకు లోనైనట్టు తెలిసింది.
కేసినో కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ ఈడీ విచారణకు హాజరయ్యారు. నేపాల్ లో చికోటి ప్రవీణ్ నిర్వహించిన కేసినో ఈవెంట్లకు సంబంధించి రమణను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. జూన్ లో బిగ్ డాడీ పేరుతో నేపాల్ లో నిర్వహించిన ఈవెంట్ పై ప్రశ్నిస్తున్నారు. మే నెలలో కొన్ని ప్రాంతాల్లో…. జూన్ లో గోవా, నేపాల్ లో చికోటి ప్రవీణ్ పెద్ద ఎత్తున ఈవెంట్స్ నిర్వహించారు. ఈ ఈవెంట్స్ కు పెద్ద సంఖ్యలో రాజకీయ నాయకులు హాజరయ్యారని తెలుస్తోంది.
మరోవైపు ఈ అంశంపై ఎల్.రమణ స్పందిస్తూ… నేపాల్ కు రావాల్సిందిగా చికోటీ ప్రవీణ్ నుంచి తనకు ఆహ్వానం ఉందని… అయితే, తాను వెళ్లలేదని చెపుతున్నారు. ఇంకోవైపు ఇదే వ్యవహారంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులతో పాటు వైసీపీ నేత గురునాథ్ రెడ్డిని కూడా ఈడీ అధికారులు విచారించారు.