ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి..
- బంజారాహిల్స్ లోని అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ దాడి
- అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం
- దాడి సమయంలో నిజామాబాద్ లో ఉన్న అర్వింద్
నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా: బీజేపీ ఎంపీ అర్వింద్ కు కవిత వార్నింగ్
- కవిత కాంగ్రెస్ లో చేరబోతోందన్న అర్వింద్
- పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు అంటూ కవిత వార్నింగ్
- ఖర్గేతో మాట్లాడానని తప్పుడు ప్రుచారం చేశాడని మండిపాటు
- కేసీఆర్ ను కూడా అనరాని మాటలు అన్నాడని ఫైర్
- అర్వింద్ ఎక్కడ పోటీ చేసినా ఆయనపై పోటీ చేసి ఓడిస్తానని సవాల్
చెప్పుతో కొడతానంటూ బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీరియన్ వార్నింగ్ ఇచ్చారు. కవిత టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరబోతున్నారని… కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఆమె మాట్లాడారని నిన్న అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియాతో కవిత మాట్లాడుతూ… మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.
ఇంకోసారి పార్టీ మారుతోందని తన గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతానని కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెద్దాచిన్నా అనేది కూడా లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి కూడా నీచంగా మాట్లాడాడని, అనరాని మాటలు అన్నాడని మండిపడ్డారు. తమాషాలు చేస్తే ఊరుకోబోమని చెప్పారు.
రాజకీయం చేస్తే పర్వాలేదని, పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఊరుకోబోమని కవిత అన్నారు. అర్వింద్ తెలంగాణలో ఎక్కడ పోటీ చేసినా… తాను ఆయనపై పోటీ చేసి చిత్తుగా ఓడిస్తానని చెప్పారు. తెలంగాణకు నీవు చేసిందేముందని ప్రశ్నించారు. పసుపు బోర్డు తీసుకురాలేనని అర్వింద్ రైతుల కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరాలని అన్నారు. తాను ఖర్గేతో మాట్లాడానని తప్పుడు ప్రచారం చేస్తున్నాడని… కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నది నీవే అని దుయ్యబట్టారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతోనే అదృష్టవశాత్తు అర్వింద్ గెలిచాడని ఎద్దేవా చేశారు.
రాజస్థాన్ లో చదువుకున్నట్టు అర్వింద్ ఫేక్ సర్టిఫికెట్ పెట్టాడని, ఆ యూనివర్శిటీనే లేదంటున్నారని… ఈ విషయం గురించి ఈసీకి ఫిర్యాదు చేస్తానని కవిత చెప్పారు. ఇంకోసారి లైన్ దాటి మాట్లాడితే కొట్టికొట్టి చంపుతామని హెచ్చరించారు. తాను ఇప్పటి వరకు ఏ ఒక్క వ్యక్తి గురించి వ్యక్తిగతంగా మాట్లాడలేదని… తొలిసారి మాట్లాడానని చెప్పారు. ఎంత పడితే అంత మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.