Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మంత్రి ఈటల భూకబ్జాలకు పాల్పడ్డారా ? ఉద్వాసన ఖాయమేనా!

మంత్రి ఈటల భూకబ్జాలకు పాల్పడ్డారా ? ఉద్వాసన ఖాయమేనా
రైతుల ఆరోపణల్లో నిజముందా ?? ధర్మారెడ్డి రిపోర్ట్ ఏమిచ్చారు.?
-ఈటెల కబ్జాలకు పాల్పడ్డారంటూ రైతుల సంచలన ఆరోపణలు
-మెదక్ జిల్లాలో తమ భూములు ఆక్రమించుకున్నారని వెల్లడి
-తన భార్య జమున పేరిట హేచరీస్ నిర్మిస్తున్న ఈటల!
-హేచరీస్ కోసం తమ భూములు కబ్జా చేశారన్న రైతులు
-అధికారులకు ఫిర్యాదు…విచారణ చేపట్టిన అధికారులు

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జాలకు పాల్పడ్డారంటూ మెదక్ జిల్లా రైతులు సంచలన ఆరోపణలు చేశారు. నిజంగా ఈటెల భూకబ్జాలకు పాల్పడ్డారా ? ఆయనకు మంత్రి వర్గం నుంచి ఉద్వాసన తప్పదా ? ఇది నేడు తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేకించి టీఆర్ యస్ రాజకీయాల్లో హాట్ టాపిక్ …. ఇందులో నిజమెంత …. ఆయన ప్రతిసారి నీతి, నిజాయతీల గురించి మాట్లాడతారు కదా ? అలాంటి నేత భూకబ్జాలపై కొందరిలో సందేహాలు … ఎక్కడ ఎదో జరుగుతుందనే అనుమానాలు …. ఈటల కేసీఆర్ కేబినెట్ లో సీనియర్ మంత్రి …. తన అభిప్రాయాలను కుండబద్దలు కొడతానే పేరుంది. కానీ అనేక అసందర్భాలలో ఆయన ప్రభుత్వ చర్యలను కూడా తప్పు పడుతుంటారు. అనేక పథకాలపై తన అభిప్రాయాలను బహిరంగంగానే వెల్లడించారు. చాల సందర్భాలలో ఆయనను మంత్రి వర్గం నుంచి తప్పిస్తారని అభిప్రాయాలు కూడా వ్యక్తం అయ్యాయి . ఇప్పుడు హకీమ్ పేట భూముల వ్యవహారం వెలుగు చూడటంతో ఆయన ఉద్వాసన ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నిజంగా ఆయన భూకబ్జాలకు పాల్పడితే ఉద్వాసన తప్పదు .
హకీంపేట, అచ్చంపేట గ్రామాల్లో తమ భూములను మంత్రి ఈటల కబ్జా చేశారంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన పలువురు రైతులు ఆరోపించారు. మాసాయిపేట మండలంలో తమ భూమిని కబ్జా చేశారని రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో ఆయా భూముల సర్వే నెంబర్లు కూడా పొందుపరిచారు.

ఈటల తన భార్య జమున పేరిట జమున హేచరీస్ స్థాపిస్తున్నారని, అందుకోసం దాదాపు 100 ఎకరాల అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నారని రైతులు వెల్లడించారు. ఈ భూములను తన భార్య జమున, కుమారుడు నితిన్ పేర్ల మీద అధికారులపై ఒత్తిడి తెచ్చి మరీ రిజిస్ట్రేషన్ చేయించారని వివరించారు. కాగా, రైతుల ఫిర్యాదుపై అధికారులు విచారణ చేపట్టారు.
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులోని భూములు కబ్జాకు గురయ్యాయనే విషయంలో తనకు అందిన ఫిర్యాదును పురస్కరించుకుని వెంటనే దర్యాప్తు జరిపి సమగ్ర నివేదికు జిల్లా కలెక్టర్ ద్వారా తెప్పించి రిపోర్టు అందచేయాల్సిందిగా సిఎస్ సోమేశ్ కుమార్ ను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఈ భూముల విషయంలో వస్తున్న ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గుదేల్చాల్సిందిగా విజిలెన్స్ డిజి పూర్ణచందర్ రావు ని సిఎం అదేశించారు. సత్వరమే ఇందుకు సంబంధించి ప్రాధమిక నివేదికను అందజేసి అనంతరం సమగ్ర దర్యాప్తు జరిపి నివేదికలను అందజేయాల్సిందిగా సిఎం ఆదేశాలు జారీ చేశారు…

ఈటెలను తప్పించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారా ?

ఈటల రాజేందర్ను కేబినెట్ నుంచి తప్పించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు ముమ్మర ప్రచారం జరుగుతుంది. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులో సుమారు 100 ఎకరాల భూమి అంశంలో మంత్రి ఈటలపై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో అప్పడు కలెక్టర్గా పని చేసిన ధర్మారెడ్డి పూర్తి వివరాలు, మంత్రి ఈటల ప్రమేయాన్ని సీఎం కేసీఆర్కు నివేదించినట్లు విశ్వసనీయ సమాచారం.

దాదాపు నాలుగున్నరేండ్ల కిందట ఈ వ్యవహారం జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల ఈ భూమికి ఓ రోడ్డు విషయంలో రైతులతో రాజీ కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై కొంతమంది రైతులు వ్యతిరేకించడంతో ఈ వ్యవహారం బయటకు పొక్కింది. ఈ భూ వ్యవహారంలో ఈటల రాజేందర్పై చర్యలు తీసుకుంటూ మంత్రి వర్గం నుంచి ఉద్వాసన పలికేందుకు నిర్ణయం తీసుకున్నట్లు టాక్. రేపో, మాపో మంత్రి ఈటలను కేబినెట్ నుంచి తప్పించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకుంటున్నారు.

మరోవైపు మంత్రి ఈటల వ్యవహారం శుక్రవారం సాయంత్రం మీడియాలో వైరల్గా మారింది. టీఆర్ఎస్ పార్టీ అధికారిక ఛానల్గా గుర్తింపు ఉన్న టీ న్యూస్లో కూడా ‘‘ఆరోగ్య శాఖ మంత్రికి కబ్జారోగం’’ అంటూ ఇదే అంశాన్ని హైలెట్ చేసింది. అటు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే పలు ఛానళ్లలో కూడా ఈ వార్త పదేపదే రావడం సంచలనంగా మారింది.

Related posts

సొంత సోదరుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎంపీ కేశినేని నాని!

Drukpadam

నామినేషన్ కార్యక్రమంలో భార్య వెంటే క్రికెటర్ జడేజా!

Drukpadam

బీజేపీ వైఖరిని తప్పు పట్టిన మంద కృష్ణ మాదిగ …

Drukpadam

Leave a Comment