లంచం తీసుకుంటూ దొరికిన ఎస్సై.. ఆధారాలు లేకుండా నోట్లు మింగేసే యత్నం..
- హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఘటన
- గేదెను దొంగిలించారని ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బాధితుడు
- రూ. 10 వేల లంచం డిమాండ్ చేసిన ఎస్సై
- రూ. 6 వేలు ఇచ్చినా ససేమిరా అన్న పోలీస్
- మిగతా రూ. 4 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ఎస్సై
లంచం తీసుకుంటూ విజిలెన్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన ఓ ఎస్సై ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు కరెన్సీ నోట్లను మింగేసే ప్రయత్నం చేశాడు. దీంతో అతడి నోట్లో నుంచి డబ్బులను బయటకు లాగేందుకు అధికారులు పడరాని పాట్లు పడ్డారు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సుభ్నత్ అనే వ్యక్తి గేదెను ఎవరో దొంగిలించారు. దీంతో ఫిర్యాదు చేసేందుకు ఆయన పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ఫిర్యాదు స్వీకరించి న్యాయం చేయాలంటే రూ. 10 వేలు సమర్పించుకోవాల్సిందేనని ఎస్సై మహేంద్ర డిమాండ్ చేశాడు. దీంతో సుభ్నత్ రూ. 6 వేలు సమర్పించుకున్నాడు. మిగతా నాలుగు వేలు కూడా ఇస్తేనే కేసు సంగతి చూస్తానని ఎస్సై తేల్చి చెప్పాడు. దీంతో అతడు మిగతా రూ. 4 వేలు కూడా తెచ్చి ఇస్తున్న సమయంలో విజిలెన్స్ అధికారులు దాడి చేసి ఎస్సైని పట్టుకున్నారు.
దీంతో ఒక్క క్షణం షాకైన ఎస్సై ఆధారాలు లేకుండా చేసేందుకు తీసుకున్న లంచం సొమ్మును మింగేసే ప్రయత్నం చేస్తూ నోట్లను నోటిలో కుక్కేసుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఎస్సై నోట్లో వేలు పెట్టి నోట్లు బయటకు లాగేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఎస్సైని తమ వాహనంలో తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎస్సైపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.