సావర్కర్ విషయంలో కర్ణాటకలో మరో వివాదం!
- బెలగావిలోని కర్ణాటక అసెంబ్లీ భవనంలో సావర్కర్ ఫొటో
- వ్యతిరేకిస్తూ భవనం బయట ప్రతిపక్ష కాంగ్రెస్ నేతల నిరసన
- తమను సంప్రదించకుండా ఫొటో ఎలా పెడతారని ప్రశ్నిస్తున్న నేతలు
హిందూ సిద్ధాంతకర్త వీర్ సావర్కర్ విషయంలో కర్ణాటకలో మరోసారి వివాదం రాజుకుంది. కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ భవనం లోపల సావర్కర్ చిత్ర పటాన్ని ఉంచాలని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బెళగావిలో అసెంబ్లీ శీతాకాల సమావేశాల ప్రారంభం రోజున విపక్షాల ఆగ్రహం, నిరసనలకు దారితీసింది. కాంగ్రెస్ నేత, ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్య ఈ నిరసనకు నాయకత్వం వహించారు. కర్ణాటక అసెంబ్లీలో వివాదాస్పద వ్యక్తి చిత్రాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసెంబ్లీ భవనం మెట్లపై కాంగ్రెస్ నేతలు మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ సహా పలువురు నాయకుల చిత్రాలను పట్టుకుని నిరసన తెలిపారు.
‘మేము అసెంబ్లీని అడ్డుకుని నిరసన తెలపాలని అధికార పక్షం వారు కోరుకుంటున్నారు. మేం సెషన్‌లో అవినీతి సమస్యలను లేవనెత్తుతామని వారికి తెలుసు. అందుకే ప్రతిపక్షాన్ని సంప్రదించకుండా సావర్కర్ చిత్రపటాన్ని ఉంచి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు’ అని కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు డీకె శివకుమార్ ఆరోపించారు.
అసెంబ్లీ హాలులో సావర్కర్ ఫొటో మాత్రమే కాకుండా అందరు జాతీయ నాయకులు, సంఘ సంస్కర్తల ఫొటోలు పెట్టాలని సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. 2023 రాష్ట్ర ఎన్నికలకు నెలల ముందు కర్ణాటకలో వీర్ సావర్కర్‌పై వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. వీర్ సావర్కర్ గురించి అవగాహన పెంచడానికి అధికార బీజేపీ రాష్ట్ర వ్యాప్త ప్రచారాన్ని ప్రారంభించిందని, అసెంబ్లీ భవనంలో ఆయన చిత్రపటాన్ని ఉంచడం అందులో భాగమని బీజేపీ నాయకులు తెలిపారు.
ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు వివాదంలో కేంద్ర బిందువుగా మారిన బెలగావితో కూడా వీర్ సావర్కర్‌కు సంబంధం ఉంది. 1950లో సావర్కర్‌ను బెలగావిలోని హిందల్గా సెంట్రల్ జైలులో నాలుగు నెలల పాటు నిర్బంధంలో ఉంచారు. నాడు ముంబైలో అరెస్టు ఉత్తర్వు జారీ అవగా, సావర్కర్ బెలగావికి రాగానే అరెస్టయ్యారు. పాకిస్థాన్ మాజీ ప్రధాని లియాఖత్ అలీ ఖాన్ ఢిల్లీ పర్యటనకు వ్యతిరేకంగా నిరసన తెలిపే ప్రయత్నంలో ఆయనను నిర్బంధంలో ఉంచారు. కుటుంబసభ్యులు పిటిషన్ దాఖలు చేయడంతో ఆయన విడుదలయ్యారు.
కాగా, వచ్చే ఏడాది రాష్ట్ర ఎన్నికలకు ముందు బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వానికి ఇవే చివరి శీతాకాల సమావేశాలు. బెళగావిలో జరిగే 10 రోజుల సెషన్‌లో కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం ప్రధాన చర్చగా మారనుంది.