Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్యానా క్రీడల మంత్రి రాజీనామా!

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్యానా క్రీడల మంత్రి రాజీనామా!

  • సందీప్ సింగ్ పై ఫిర్యాదు చేసిన మహిళా కోచ్
  • కేసు నమోదు చేసిన చండీగఢ్ పోలీసులు
  • తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఆరోపణలు చేస్తున్నారన్న సందీప్ సింగ్
  • దర్యాప్తుతో వాస్తవాలు బయటికి వస్తాయని వెల్లడి

ఓ జూనియర్ అథ్లెటిక్స్ మహిళా కోచ్ ను లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న హార్యానా రాష్ట్ర క్రీడల మంత్రి సందీప్ సింగ్ పదవికి రాజీనామా చేశారు. మహిళా కోచ్ ఫిర్యాదు అనంతరం, చండీగఢ్ పోలీసులు సందీప్ సింగ్ పై లైంగిక వేధింపులు, నేరపూరిత బెదిరింపుల కేసు నమోదు చేశారు.

ఈ నేపథ్యంలో, సందీప్ సింగ్ మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. తన ప్రతిష్ఠను మంటగలిపేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు చేస్తే నిజానిజాలేంటో బయటపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న విషయం బట్టబయలవుతుందని తెలిపారు. తనపై కేసు నమోదైన నేపథ్యంలో, దర్యాప్తు నివేదిక వచ్చేంత వరకు క్రీడల మంత్రిత్వ శాఖ బాధ్యతలను ముఖ్యమంత్రికి అప్పగిస్తున్నానని సందీప్ సింగ్ వెల్లడించారు.

ఇప్పటివరకు హర్యానా క్రీడల మంత్రిగా వ్యవహరించిన సందీప్ సింగ్ ఒకప్పుడు క్రీడాకారుడే. ఆయన భారత జాతీయ హాకీ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించారు. బీజేపీలో చేరిన సందీప్ సింగ్ పెహోవా నియోజకవర్గం నుంచి గెలిచి క్యాబినెట్ లో మంత్రి పదవి చేపట్టారు. ఆయన జీవితంపై 2018లో ‘సూర్మా’ పేరిట బయోపిక్ కూడా విడుదలైంది. సందీప్ సింగ్ ఎంటీవీలో ప్రసారమయ్యే రోడీస్ కార్యక్రమానికి జడ్జిగానూ వ్యవహరించారు.

కాగా, 2007 హాకీ వరల్డ్ కప్ మరో రెండ్రోజుల్లో ప్రారంభం కానుందనగా, ఢిల్లీ వెళ్లేందుకు రైలు ఎక్కుతున్న సందీప్ సింగ్ కు బుల్లెట్ గాయమైంది. రైల్వే ఏఎస్ఐ తుపాకీ పొరపాటున పేలడంతో బుల్లెట్ సందీప్ సింగ్ కు తగిలింది. దాంతో నడుము కింది భాగం పనిచేయకపోవడంతో ఏడాది పాటు మంచానికే పరిమితమయ్యాడు. అప్పుడు సందీప్ సింగ్ కు 20 ఏళ్లు. ఆ తర్వాత కాలంలో పుంజుకుని మళ్లీ హాకీలో రాణించి పేరుప్రతిష్ఠలు అందుకున్నాడు. 2010లో సందీప్ సింగ్ ను అర్జున అవార్డు కూడా వరించింది.

Related posts

వేశ్యల పాలిట యముడు… 14 మంది దారుణ హత్య

Ram Narayana

విశాఖలో శ్రద్ధా వాకర్ తరహా హత్య కేసు… ఛేదించిన పోలీసులు!

Drukpadam

కోర్ట్ ఆదేశాలతో సినీనటి జయప్రద కోసం పోలిసుల వేట …

Ram Narayana

Leave a Comment