Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

ఎన్నికలపై పెట్టిన దృష్టి కరోనా కట్టడిపై ఒక్క శాతం పెట్టినా బాగుండేది!:సంగీత దర్శకుడు ఆర్‌.పి.పట్నాయక్‌

మన నేతలు ఎన్నికలపై పెట్టిన దృష్టి కరోనా కట్టడిపై ఒక్క శాతం పెట్టినా బాగుండేది!: సంగీత దర్శకుడు ఆర్‌.పి.పట్నాయక్‌
  • కరోనా పరిస్థితులపై తీవ్ర ఉద్వేగానికి లోనైన పట్నాయక్‌
  • నాయకుల తీరుపై తీవ్ర విమర్శలు
  • మౌలిక వసతులు లేక అనేక మంది మరణిస్తున్నారని ఆవేదన
  • ఎవరికి వారు స్వచ్ఛందంగా ఇంట్లో ఉండాలని పిలుపు
Music Director RP Patnaik went emotional on current covid situation

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్‌.పి.పట్నాయక్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు చైనాలోని వుహాన్‌ని చూసినట్లు ప్రజలు ఇప్పుడు భారత్‌ని చూస్తున్నారని వ్యాఖ్యానించారు.

అనేక మందికి ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌, బెడ్లు, వెంటిలేటర్లు దొరకడం లేదని అన్నారు. కొవిడ్‌ కంటే ఆక్సిజన్‌ దొరక్క చనిపోతున్నవారే ఎక్కువ అంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దేశంలో అనేక మంది తమ ఆత్మీయుల్ని కోల్పోవాల్సిన దుస్థితి తలెత్తిందన్నారు. తనకు తెలిసిన వారు సాయం కోసం ఫోన్‌ చేస్తే ఆదుకోలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

వైద్యారోగ్య వ్యవస్థలో మౌలిక సదుపాయాలు సరిగా లేక అనేక మంది చనిపోతున్నారని పట్నాయక్‌ అన్నారు. కొవిడ్‌ పాజిటివ్‌, మరణాలకు సంబంధించి బయటకు వస్తున్న లెక్కల్లో నిజం లేదని.. అసలు విషయం శ్మశానాలకు వెళితే అర్థమవుతుందంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. శ్మశానాల వద్ద శవాలను క్యూలో ఉంచాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు, విజయాలు అంటూ రాజకీయాలు చేస్తున్న నాయకులు ఉండడం దౌర్భాగ్యమని పట్నాయక్‌ విమర్శించారు. ‘అసలు మీరు మనుషులేనా?’ అంటూ రాజకీయ నాయకుల్ని నిలదీశారు. ఎన్నికలపై పెట్టిన దృష్టి కరోనా కట్టడిపై ఒక్క శాతం పెట్టినా బాగుండేదన్నారు. ఇప్పటికైనా మేల్కొని.. ప్రస్తుతం కొవిడ్‌తో బాధపడుతున్నవారినైనా కాపాడుకునే ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా డాక్టర్లు చేస్తున్న కృషిని పట్నాయక్‌ కొనియాడారు. వారికి పాదాభివందనం చేసినా తప్పులేదన్నారు. బాధితుల్ని కాపాడలేకపోతున్నామని డాక్టర్లు సైతం ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

దీనికి మనంతట మనం ఇళ్లలో లాక్‌డౌన్‌ చేసుకోవడమే సరైన మార్గమని పట్నాయక్‌ సూచించారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధిస్తే రాష్ట్రాలకు నిధులు ఇవ్వాల్సి వస్తుందని కేంద్రం.. కేంద్రం ప్రభుత్వం నుంచి నిధులు వస్తే లాక్‌డౌన్ విధిస్తామని రాష్ట్రాలు ఆలోచిస్తున్న దుస్థితిలో ఉన్నాయన్నారు. లాక్‌డౌన్ విధించకపోవడం వల్ల ప్రజలు సంచరించినా తప్పు లేదన్న సంకేతం వెళుతోందన్నారు.

ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకొని డబ్బు గుంజాలని చూస్తున్న కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల తీరును పట్నాయక్‌ తప్పుబట్టారు. కనీసం ఇలాంటి పరిస్థితుల్లోనైనా మానవత్వంతో వ్యవహరించాలని కోరారు. కనీస ఖర్చులు మాత్రమే వసూలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆసుపత్రుల్లో వేసే భారీ బిల్లుల్ని కట్టలేక అనేక మంది పేదరికంలోకి జారుకుంటున్నారని తెలిపారు. దయచేసి ఇప్పుడైనా కార్పొరేట్‌ ఆసుపత్రులు మానవత్వంతో వ్యవహరించి వీలైనంత తక్కువ డబ్బులు వసూలు చేయాలని విజ్ఞప్తి చేశారు. డబ్బులు ఆశించకుండా స్వచ్ఛందంగా చికిత్స చేస్తున్నవారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

Related posts

లాక్ డౌన్ దిశగా భారత్ …న్యూ ఇయర్ వేడుకలు లేనట్లే…?

Drukpadam

మహారాష్ట్రలో బ్లాక్ ఫంగస్ విజృంభణ… ఉచితంగా చికిత్స ప్రభుత్వ నిర్ణయం

Drukpadam

తెలంగాణ లో లాక్‌డౌన్ మరో 10 రోజుల పొడిగింపు ….

Drukpadam

Leave a Comment