మా ప్రేమకు 15 ఏళ్లు.. పెళ్లి చేసుకుంటాం అనుమతివ్వండి: సుప్రీంకోర్టుకెక్కిన యువకులు!
- సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉత్కర్ష్ సక్సేనా-అనన్య కోటియా జంట
- మరికొన్ని పిటిషన్లతో కలిసి మార్చిలో విచారిస్తామన్న న్యాయస్థానం
- అనుమతిస్తే రెండో దేశంగా రికార్డులకెక్కనున్న భారత్
అందరిలానే వారి ప్రేమ కూడా కాలేజీలోనే ప్రారంభమైంది. ఇప్పుడు వారి ప్రేమకు 15 ఏళ్లు నిండాయి. ఇక ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. అందరిలానే పెళ్లి విషయంలో వారికీ ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇక లాభం లేదని తమ వివాహానికి అనుమతి ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో కొత్తదనం ఏముందనేగా మీ అనుమానం. ఉంది! కోర్టును ఆశ్రయించిన ఆ జంట ఇద్దరు యువకులు కావడమే ఇక్కడ విశేషం. స్వలింగ సంపర్కులైన ఉత్కర్ష్ సక్సేనా, అనన్య కోటియా కథ ఇది.
వారి అభ్యర్థనను మన్నించి అత్యున్నత న్యాయస్థానం కనుక అనుమతి ఇస్తే.. తైవాన్ తర్వాత స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్ధం చేసిన రెండో ఆసియా దేశంగా భారత్ రికార్డులకెక్కుతుంది. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించని దేశంగా భారత్ నిలుస్తుంది. అంతేకాదు, ఎల్‌జీబీటీ క్యూ జంటలకు ఆ హక్కును కల్పించిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగానూ భారత్ చరిత్ర సృష్టిస్తుంది. ఉత్కర్ష్-అనన్య పిటిషన్లతోపాటు మరో ముగ్గురు స్వలింగ సంపర్కులు కూడా కోర్టుకెక్కారు. వీరందరి పిటిషన్లు కలిసి మార్చిలో విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో పబ్లిక్ పాలసీ స్కాలర్ అయిన సక్సేనా మాట్లాడుతూ.. ఈ పరిణమాలు తొలుత తమను చాలా భయపెట్టాయని అన్నారు. నిజానికి భారతీయ సమాజంలో ఇలాంటి వివాహాలకు తావులేదు. అయితే, ఇటీవలి కాలంలో స్వలింగ సంపర్కులు బాహాటంగానే తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ అందరి ఆమోదం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇక, తాజా జంట విషయానికి వస్తే వారు తమ బంధాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులకు చెప్పాలని అనుకున్నారు. వారిలో చాలామంది వారి బంధాన్ని అంగీకరించారు కూడా. సుప్రీంకోర్టు జోక్యంతో గత దశాబ్దకాలంగా దేశంలో ఎల్‌జీబీటీక్యూ వ్యక్తులు సమాన హక్కులు పొందగలుగుతున్నారు. స్వలింగ సంపర్కానికి పదేళ్ల వరకు జైలు శిక్ష విధించే బ్రిటిష్ కలోనియల్ చట్టాన్ని రద్దు చేసిన కోర్టు 2018లో చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది. స్వలింగ సంపర్కులకు కూడా రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను విస్తరించింది. స్వలింగ సంపర్కులు బయటపడడానికి ఇది దోహదం చేసింది.
కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందన్న నమ్మకంతో ఉన్న సక్సేనా- కోటియా జంట తమ వివాహాన్ని ఘనంగా చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. తాము ఘనంగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నామని, కానీ తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు మాత్రం మరింత ఘనంగా పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నారని సక్సేనా చెప్పుకొచ్చాడు.