బలమైన నినాదం,సెంటిమెంట్ లేకుండా బీఆర్ యస్ ప్రజలను సమీకరించగలదా…?
కమిటీ లేకుండానే జాతీయపార్టీ గా కొనసాగుతున్న బీఆర్ యస్
కనీసం అడహాక్ కమిటీ లేకపోవడం శోచనీయం
జెండా ఉన్న ఎజెండా లేని పార్టీగా బీఆర్ యస్
కార్యాలయాల ప్రారంభం పేరుతో సీఎంలకు,రాజకీయ పార్టీలకు ఆహ్వానాలు
ఈసందర్భంగానే భారీ ఖర్చుతో బీఆర్ యస్ సభలు
దేశం కేసీఆర్ ను కోరుకుంటుందని ప్రచారం
బహిరంగ సభల్లో కామన్ ఎజెండా,కనీసం డిక్లరేషన్ లేకపోవడం పై విమర్శలు
బలమైన నినాదంగాని సెంటిమెంట్ గాని లేకుండా ప్రజలను సమీకరించడం బీఆర్ యస్ కు సాధ్యం అవుతుందా ? అంటే కష్టమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు … బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ యస్ పెట్టిన కేసీఆర్ ,బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టంలో సక్సెస్ అవుతారా ? అంటే దీనిపై ఇప్పుడే విశ్లేషించడం తొందరపాటు అవుతుంది . కేసీఆర్ చెపుతున్నట్లుగా దేశమంతా కోతలు లేని విద్యత్ సరఫరా , రైతుబంధు , దళితబంధు ,ప్రాజక్టులు , నీటి వినియోగం లాంటి సమస్యలను ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు .ఒక మండల్ కమిషన్ , ఒక అయోధ్యలో రామమందిరం నిర్మాణం ,ఇందిరా గాంధీ పెట్టిన ఎమర్జన్సీకి వ్యతిరేకంగా జయప్రకాశ్ నారాయణ ఆధ్వరంలో జరిగిన ఉద్యమం లాంటివి రావాలి. బహుముఖ నినాదాలు చుట్టూ తిరిగితే పెద్ద ప్రయోజనం ఉండదు .
బీఆర్ యస్ కు ఒక ఉద్యమంలా ,ఉప్పెనలా , ఉరకలు పెట్టించే అంశం కనిపించడంలేదు . పైగా చిన్న చితక పార్టీలు మినహా ఏ పార్టీ బీఆర్ యస్ ను సమర్థించడంలేదు . పార్టీ ప్రకటించిన నాటి నుంచి ఇప్పటివరకు బలమైన ప్రాంతం , సెక్షన్ , బీఆర్ యస్ కు దగ్గరైంది లేదు . జాతీయస్థాయిలో పూర్తీ స్థాయి కమిటీ లేదు .కనీసం అడహాక్ కమిటీ కూడా లేదు . జాతీయ పార్టీ నడపడం ఆషామాషీ విషయం కాదు . ఆ విషయం కేసీఆర్ కు తెలియంది కాదు . అన్ని రాష్ట్రాల్లో సంబంధాల కోసం తంటాలు పడుతున్నారు . ఎదో చేయాలనే పట్టుదలతో అడుగులు వేస్తున్నారు . అంతవరకూ ఆయన్ను మెచ్చుకోవాల్సిందే … అయితే ఆయనలో సమష్టి తత్వంలేదనే విమర్శలు ఉన్నాయి . ప్రాంతీయ పార్టీని నడపడం వేరు ,జాతీయ పార్టీని నడపడం వేరు. పైగా “అన్ని బంధాలకు ఆర్ధిక సంబంధాలే కీలకం అన్న మర్క్స్ ” మాటలు విస్మరించడానికి వీలులేనివి. ఇప్పటికే కేసీఆర్ వివిధ రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష పార్టీలకు డబ్బులు పంపించారని ఆరోపణలు ఉన్నాయి. అవి ఇచ్చినంత కాలం తన చుట్టూ తిరిగే చుట్టాలు అవి లేకపోతె ముఖం చాటేయడం ఖాయమనే విషయాన్నీ కేసీఆర్ కు తెలియదని అనుకోవడం తెలివి తక్కువ తనం అవుతుంది .
ఇప్పుడిప్పుడే కొన్ని రాష్ట్రాల నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న నాయకులు బీఆర్ యస్ లో చేరేందుకు హైద్రాబాద్ కు క్యూకడుతున్నారు . వారిని వారి సొంతపార్టీలు పట్టించుకోకపోవడంతో వేరే దారి లేక బీఆర్ యస్ లో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది . వీరి చేరికవల్ల బీఆర్ యస్ కు ఎంతవరకు మేలు జరుగుతుందనేది ప్రస్నార్ధకమే? . వచ్చే ఎన్నికల్లో 75 లోకసభ సీట్లపై కేసీఆర్ ద్రుష్టి పెట్టారని వార్తలు వస్తున్నాయి. అవికూడా తెలంగాణ , ఆంధ్ర, కర్ణాటక ,మహారాష్ట్ర , ఒడిశా ,తమిళనాడు రాష్ట్రాల నుంచి పోటీచేసేలా పథకరచన చేస్తున్నారు .
బీఆర్ యస్ ఖమ్మం సభ …
బీఆర్ యస్ ఏర్పడిన తర్వాత మొదటి సభను తెలంగాణ లోని ఖమ్మం ను ఎంచుకున్నారు . అందుకు తగ్గట్లుగా ఇక్కడ ఏర్పాట్లను చేశారు . సభకు వారు అనుకున్నంత మంది జనం రాకపోయినా భారీగానే ప్రజలను సమీకరించాకలిగారు . దీనికోసం ఖర్చు కూడా బాగానే పెట్టారని సమాచారం . అయితే సభజరిగిన తీరు నిరుత్సాహంగా ఉందనే అభిప్రాయాలే ఉన్నాయి. పేరుకు నూతన కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభం , కంటివెలుగు కార్యక్రమం రెండొదశ ప్రారంభం …దానితో పాటు సభకు వివిధ పార్టీల నాయకులను , ముఖ్యమంత్రులను ఆహ్వానించారు . బహిరంగ సభ పెట్టారు .దీనికి భారీగానే జనం వచ్చారు . ఫలితం మాత్రం కనిపించినట్లు లేదు . వచ్చిన నాయకుల మధ్య కామన్ ఎజెండాగాని ప్లాట్ ఫారం గాని కనిపించలేదు . మరికొన్ని సభలు జరపాలని గులాబీ బాస్ భావిస్తున్నారు . ఇంత చేస్తున్న బీజేపీకి ,బీఆర్ యస్ కు మధ్య సంబంధాలు ఏమైనా ఉన్నాయా ? అనే సందేహాలు లేకపోలేదు . అయితే లెఫ్ట్ పార్టీలు మాత్రం కేసీఆర్ బీజేపీ వ్యతిరేక పోరాటాన్ని మెచ్చుకోవడం ఆయనతో కలిసి నడవడం గమనార్హం . లెఫ్ట్ పార్టీల వల్ల దిగజారిపోతున్న కేసీఆర్ ప్రతిష్టకు కు మైలేజ్ వచ్చిన మాట విస్మరించరాదు .వారి గుడ్ విల్ ను వాడుకుంటున్న కేసీఆర్ వారిని కలుపుకొని వెళ్ళితే మంచి గుర్తింపు వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు …
నిర్మాణం లేని బీఆర్ యస్ …
ఒక్క ఏపీలో మాత్రమే అధ్యక్షుడు ఉన్నారు తప్ప తెలంగాణతో సహా ఎక్కడ అధ్యక్షుడు ఉన్న దాఖలాలు లేవు . తెలంగాణాలో మాత్రం టీఆర్ యస్ వర్కింగ్ ప్రసిడెంట్ గా ఉన్న కేటీఆర్ నే బీఆర్ యస్ వర్కింగ్ ప్రసిడెంట్ అంటున్నారు .బీఆర్ యస్ జాతీయ అధ్యక్షుడుగా కేసీఆర్ ఉన్నారు . రాష్ట్రానికి కూడా ఆయనే ఉన్నారా ? లేరా? అనేది క్లారిటీ లేదు .బీఆర్ యస్ అధ్యక్షుడిగా కేటీఆర్ కు భాద్యతలు అప్పగిస్తారా? లేదా ? అనే ఆసక్తి ఉంది .
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఒక చారిత్రిక ఘట్టం …
కేసీఆర్ 2001 -02 లలో పెట్టిన టీఆర్ యస్ ఒకబలమైన నినాదంతో,రాష్ట్రం ఏర్పడాలనే బలమైన సెంటిమెంట్ తో పుట్టింది. 99 శాతం మంది తెలంగాణ ప్రజల్లో సొంతరాష్ట్ర ఏర్పడాలనే ఆకాంక్షబలంగా ఉంది . దానికోసం సబ్బండ వర్గాల ప్రజలు మనరాష్ట్రం,మన జెండా , మనపార్టీ , నీళ్లు ,నిధులు , నియామకాలు కోసం ఒక్కటైయ్యారు . అనేక ఉద్యమాలు ,ఆందోళనలు , మిలియనీయం మార్చ్ ,సకల జనుల సమ్మె,
దుందాం లాంటివాటితో ప్రజలను ఊర్రుతలు ఊగించిన ఒక మహా ఉద్యమం అది . ఉద్యమాలతో కేంద్రంలో కదిలిక వచ్చింది .అనేక మంది యువకులు ఆత్మబలిదానాలు చేసుకోవడంతో రాష్ట్రం ఇవ్వకపోతే అగ్నిగుండం కాకతప్పదని నిఘావర్గాల కేంద్రానికి నివేదికలు నివేదికలు సమర్పించాయి …. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా యూపీఏ చైర్ పర్సన్ గా ఉన్న సోనియా గాంధీ చలించి పోయారు . రాష్ట్ర ఇచ్చేందుకు అంగీకరించడమే కాకుండా పార్లమెంట్ లో బిల్ పాస్ చేయించారు . ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ కూడా తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ఇచ్చింది. రాష్ట్రం ఏర్పాటులో ఆ అమ్మ ( సోనియా)నే కాదు ఈ చిన్నమ్మ ను కూడా మర్చి పోవద్దని సుస్మాస్వరాజ్ చెప్పిన మాటలు విస్మరించరానివే.. .
ఒక్క సిపిఎం మినహా అన్ని రాజకీయపార్టీలు తెలంగాణ రాష్ట్రం కావాలని జరిగిన ఉద్యమంలో భాగస్వాములు అయ్యాయి. ఈ ఉద్యమానికి కేసీఆర్ నాయకత్వం వహించారు . తన వ్యూహాలు ,ఎత్తుగడలతో దేశంలోని ఒకటి అర మినహా అన్ని పార్టీల మద్దతు కూడా గట్టగలిగారు . రాష్ట్రాన్ని తెచ్చుకో గలిగిన ఘనత ముమ్మాటికి కేసీఆర్ దే. రాష్ట్ర ఏర్పాటు అయింది. ఇది ఒక చరిత్ర… కానీ నేడు దేశంలో పార్టీ పెట్టి ఢిల్లీ వైపు చూస్తున్న కేసీఆర్ ఎర్రకోటపై గులాబీ జెండా ఎగురవేయాలని తహతహ లాడుతున్నాడు .అందుకోసం ఎలాంటి వ్యూహాలు ,ఎత్తుగడలతో ముందుకు వెళ్ళతారోననే ఆసక్తి నెలకొన్నది .