దమ్ముంటే పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేయండి…బీఆర్ యస్ కు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్…
-పార్టీ గెలుపుకోసం నా సహకారం తీసుకున్నది నిజంకాదా..?
-అప్పుడు తన చుట్టూ తిరిగి ఏమిమాట్లాడారో తెలియదా ?
-నా వాళ్ళను ఇబ్బందులు పెడితే వడ్డీతో సహా చెలించాల్సి వస్తుందని హెచ్చరిక ..
-ఏపార్టీలో చేరాలనేది ఇంకా నిర్ణయించుకోలేదు
-పార్టీ ఏదైనా నేను చెప్పినవాళ్ళే అభ్యర్థులు
-వాళ్ళను గెలిపించాల్సిన భాద్యత మనందరిపై ఉంది
-బెదిరింపులకు , కేసులకు భయపడం
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుయాయులపై బీఆర్ యస్ చర్యలు చేపట్టింది .దానిపై పొంగులేటి ఫైర్ అయ్యారు . అశ్వారావుపేట లో జరిగిన శ్రీనివాస్ రెడ్డి అభిమానులు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడుతూ బీఆర్ యస్ పై ధ్వజమెత్తారు . తన అనుయాయులపై చర్యలు , సస్పెన్షన్ లపై ఆగ్రహం వ్యక్తం చేశారు . వాళ్ళను ,వీళ్ళను కాదు దమ్ముంటే నన్ను సస్పెండ్ చేయాలనీ సవాల్ విసిరారు . అధికారం ఎవడబ్బ సొత్తుకాదు …శాశ్వతం కాదని తమవారిని ఇబ్బందులు పెడితే వడ్డీతో సహా తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చారు . ఇవేమి రాజకీయాలు ,ఇదేమి న్యాయం … ప్రజల పక్షాన నిలబడటం పాపమా ?అని ప్రశ్నించారు . అందుకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొంటామని గద్గద స్వరంతో అన్నారు . నాకు సీటు ఇవ్వకపోయినా వారిగెలుపు కోసం కృషి చేసిన విషయాన్నీ గుర్తు చేశారు .
డిసెంబర్ చివరివరకు ఖమ్మం జిల్లా బీఆర్ యస్ పార్టీలో కీలక నేతగా ఉన్న పొంగులేటి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు . 2023 జనవరి ఒకటవ తేదీన ఖమ్మంలోని తన నివాసంలో జరిగిన ఆత్మీయుల సమావేశంలో పార్టీ తనకు ఇచ్చిన గౌరవం పై మాట్లాడుతూ పార్టీకి చురకలు అంటించారు. ఫలితంగా పార్టీ ఆయన కు ఉన్న గన్ మెన్లను తగ్గించడంతోపాటు , ఎస్కార్ట్ , ఇంటిదగ్గర ఉన్న అవుట్ పోస్ట్ ను తొలగించడం అవమానకరంగా ఫీలయ్యారు . ఇక ఇందులో ఉంటె లాభం లేదనుకున్న ఆయన తనదారి తాను చూసుకుంటున్నారు . ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వవిస్తూ అభ్యర్థుల ఎంపికకు శ్రీకారం చుట్టారు .
ఆయనకు అనేక అవమానాలు జరిగి సీటు ఇవ్వకపోయినా పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడంతో మధనపడుతూ వస్తున్న శ్రీనివాస్ రెడ్డి కేటీఆర్ తో ఉన్న బంధంతో పార్టీలోనే ఉంటూ వచ్చారు . అనేక సందర్భాల్లో ఆయన పార్టీ మారుతున్నారని ప్రచారం జరిగినా తరుచు ఖండిస్తూ వచ్చారు … ఏపదవి లేకపోవడంతో జిల్లాలో ప్రోటోకాల్ లేని నాయకుడుగా ఉన్నారు .
వైకాపా ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన జగన్ ప్రోత్సాహంతో ఖమ్మం పార్లమెంట్ కు మొదటిసారి పోటీచేసి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీచేసిన నామ నాగేశ్వరరావు పై విజయం సాధించారు . తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోవడం ,వైకాపా తెలంగాణాలో తన కార్యకలాపాలను చేపట్టకపోవడంతో వైకాపా నుంచి గెలిచిన పొంగులేటి గులాబీ పార్టీలో చేరారు . చేరేటప్పుడు తిరిగి ఖమ్మం ఎంపీ సీటు ఇస్తానని వాగ్దానం చేసిన కేసీఆర్ సీటు ఇవ్వలేదు సరికదా తర్వాత ఇస్తామన్న రాజ్యసభ లేదా , ఎమ్మెల్సీ సీటు ఇవ్వకుండా అవమానమరిచారు . దానితో రగిలిపోతున్న పొంగులేటి శీనన్న సైన్యం ,శీనన్న గ్రూప్ , శీనన్న బ్రాండ్ , పేరుతో ఊరువాడా తిరుగుతున్నారు . వివిధ నియోజకవర్గాల్లో అభ్యర్థులను సైతం ప్రకటించి ప్రచారం చేస్తున్నారు . ఎన్నికల కార్యాలయాలు ప్రారంభిస్తున్నారు .
అయితే ఎదో ఒకపార్టీ లేకపోతె ఈరోజు ఉన్న ప్రజలు రేపు ఆయన వెంట ఉంటారా ?లేదా అనే చర్చ కూడా జరుగుతుంది .బీఆర్ యస్ కూడా ఆయనపై వేటు వేసేందుకు సమయం కోసం వేచి చూస్తుంది . ముందుగా వైరా నియోజకవర్గంలో అనేక మంది కీలక నేతలపై వేటు వేసిన పార్టీ జిల్లాలో మరికొందరిపై చర్యలు తీసుకొనే అవకాశం ఉన్నట్లు సమాచారం …