మొదటి నుంచి తెలంగాణకు వైఎస్ కుటుంబం వ్యతిరేకం: కడియం శ్రీహరి!
- తెలంగాణ బడ్జెట్ పై షర్మిల వ్యంగ్యం
- హరీశ్ రావు కొత్త సీసా తీసుకెళితే కేసీఆర్ పాత సారా పోశారని వ్యాఖ్యలు
- షర్మిల వ్యాఖ్యలు బాధాకరమన్న కడియం శ్రీహరి
- ఇక్కడ తిరుగుతూ సమయం వృథా చేసుకోవద్దని షర్మిలకు సలహా
తెలంగాణ బడ్జెట్ పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అభ్యంతరం చెప్పారు. ఆర్థికమంత్రి హరీశ్ రావు కొత్త సీసా తీసుకుని ఫాంహౌస్ కి వెళితే ఆయన మామ ఆ సీసాలో పాత సారా పోశారని షర్మిల వ్యంగ్యం ప్రదర్శించారు.
దీనిపై కడియం శ్రీహరి స్పందిస్తూ, బడ్జెట్ పై షర్మిల వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. వైఎస్ కుటుంబం మొదటి నుంచి కూడా తెలంగాణకు వ్యతిరేకమని విమర్శించారు. జగన్ జైలుకు వెళ్లినప్పుడు విజయలక్ష్మి, షర్మిల పాదయాత్రలు చేశారని, ఆ తర్వాత పార్టీని అధికారంలోకి తెచ్చారని వివరించారు. కానీ షర్మిల, విజయలక్ష్మికి జగన్ రాజకీయంగా అన్యాయం చేశాడని కడియం శ్రీహరి విమర్శించారు.
షర్మిల ఆంధ్రకు వెళ్లి ప్రజలకు మొరపెట్టుకోవాలని సూచించారు. రేపో మాపో జగన్ జైలుకు వెళితే నీకు అవకాశం వస్తుంది… ఇక్కడ తిరిగి నీ సమయాన్ని వృథా చేసుకోకు అని షర్మిలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.